కామధేనువు కావల్సినన్ని
పాలిస్తావుంటదని నమ్మిస్తవుంటే
ఇంటెనక పాడిగెదిచ్చే పాలు
పావుశేరంటవేందీ?
అక్షయపాత్రలో ఆహారం
అదే పనిగా వురతావుంటదని
మేము చెబుతావుంటే
పేదోడి సత్తుగిన్నెలో పాచిముద్దకు
దిక్కులేదంటవేమీ?
ఇప్పటికే కష్టపడి చరిత్ర తలనరికి మొలకీ
మొలదీసి ముఖానికీ అంటిస్తావుంటే
చీరకట్టి సింగారిస్తానంటివే
చరత్రతో మాకేం పనిబడ్ల్యా
మా చరిత్ర మాకుండాది గదా !?
ఓరీడెవుడ్రా..,!
సర్ జాన్ మార్షలంటా
వున్నోడు వున్నట్టుండక
ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని
తవ్వి తీస్తావుండాడు
ఒబ్బిడిగా పేర్చిన కట్టుకథలన్నీ
ఒక సంస్క ృతిగా నిర్మించుకుంటా వుంటే
నిజాల్ని మేమొప్పుకుంటమా ఏమీ?!
మనుషులంతా దేవుడికే పుట్టారని
దేశాన్ని ఒప్పించేదానికి
యమయాతన పడతావుంటే
ఈడెవుడే డార్వినంటా
జీవ పరిణామ సిద్ధాంతాన్ని చెబుతావుండాడు
అట్టాంటోనితో మాకేం పనీ
అందుకే పుస్తకాల్లోంచి పీకిపారేస్తా వుండాం
నిన్న మీదగా నేడు
నేటిని దాటుకుంటా రేపటిదాకా
మంత్రం చదివి సందించిన బాణం
వెలుగులు పూయిస్తదని చెబుతావుంటే
ఈ థామసాల్వా ఎడిసనొకడు
బల్బును చూయించి
మంత్రశక్తిని నిర్వీర్యం చేస్తనంటే ఎట్టొప్పుకుంటం
చీకట్లో మగ్గేదానికైనా సిద్ధమే గదో !
- బంగార్రాజు కంఠ
85003 50464










