ప్రాణం లేని
పసుపు, కుంకుమ పూసిన
రాయి కనిపిస్తే చాలు
పొర్లుదండాలు పెట్టేస్తారు
ప్రాణం ఉన్న
మానవత్వపు మనుషులకు
ఒక దండం కూడా పెట్టరు
ఏమిటో ఈ మనుషులు !
తప్ప తాగి మత్తులో
రోడ్డుకు అడ్డంగా పడుకున్న
తాగుబోతుల మొహంపై
నీళ్ళు చల్లి లేవకొడతారు
రోడ్డు ప్రమాదంలో
కొట్టు మిట్టాడే మనుషులను
కాపాడే ప్రయత్నం చేయరు
ఏమిటో ఈ మనుషులు !
పాములు గుడ్డు, పాలు తాగవని
తెలిసి పుట్టలో పోసి
ఉక్కిరి బిక్కిరి చేస్తారు
పౌష్టికాహార లోపం ఉన్న
అనాథ వీధి బాలలకు
ఒక అన్నం ముద్ద పెట్టరు
ఏమిటో ఈ మనుషులు !
కాళ్ళరిగేలా పాదయాత్ర చేసి
వెంకన్న గుడి మెట్లెక్కి
లక్షల రూపాయలు
హుండీలో వేస్తారు
అనాథ వృద్ధాశ్రమాలకు
రూపాయి విరాళం కూడా
విదల్చరు...
ఏమిటో ఈ మనుషులు !
- కయ్యూరు బాలసుబ్రమణ్యం
సెల్ : 7780277240










