- ఈ స్థలాలు మాకొద్దు 3,513 మంది ఇళ్ల స్థలాల తిరస్కరణ
- కోర్టు కేసులతో మరో 1925మంది దూరం
- ధ్రువీకరణ పత్రాలు లేవంటూ 516 మందిపై వేటు
- శాశ్వత మైగ్రేషన్ పేరిట 686 పట్టాలు రద్దు
ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి : నివాసయోగ్యమైన, ఎటువంటి వివాదాలూలేని ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చామని ప్రభుత్వం చెప్తోన్న మాటలకు, వాస్తవానికి పొంతన లేకుండా ఉంది. ప్రభుత్వం ఇచ్చిన కొన్ని స్థలాలను లబ్ధిదారులు తిరస్కరించడం, కొన్ని స్థలాలు కోర్టు వివాదాల్లో ఉండడం దీనికి అద్దం పడుతోంది. తమకు ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. తమకు ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాలు నివాస యోగ్యానికి ఏ మాత్రమూ పనికిరావంటూ విజయనగరం జిల్లాలో 3,513 మంది తిరస్కరించారు. మరో 1925 మందికి కేటాయించిన స్థలాలు కోర్టు వివాదంలో ఉండడం వల్ల ఆయా లబ్ధిదారులు వాటి దరిచేరలేకపోయారు. వారసత్వ ధ్రువీకరణ పత్రాలు లేవంటూ 516 మంది లబ్ధిదారులపై అధికార యంత్రాంగం వేటు విధించింది. మరో 686 మంది శాశ్వతంగా వలసపోయారంటూ వారి పట్టాలు రద్దు చేశారు. వెరసి విజయనగరం జిల్లాలో మొత్తం 6,640 మంది ఇళ్ల పట్టాలకు దూరమయ్యారు. అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్వాకం వల్లే వీరిలో ఐదు వేల మంది పేదలు నష్టపోవాల్సి వచ్చింది. 'నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు' పేరిట ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసిన విషయం విదితమే. జిల్లా వ్యాప్తంగా 651 లేఅవుట్లు ఏర్పాటు చేశారు. భూమి లేనిచోట కొనుగోలు చేశారు. ఇందుకోసం రూ.కోట్లు ఖర్చు చేశారు. కొన్ని లేఅవుట్లలో భూగర్భజలాలు అందుబాటులో లేకపోవడం, కొండలు, గుట్టలు కావడం, కనీసం గృహ నిర్మాణ సామగ్రిని తీసుకెళ్లేందుకు అవకాశం లేకపోవడం వంటి కారణాలతో ఆయా స్థలాలను తీసుకునేందుకు ముందుకు రాలేదు. పూసపాటిరేగ మండలంలో చోడమ్మ అగ్రహం, గోవిందపురం, ఎల్‌పి పాలెం, పేరాపురం, కొల్లాయివలస, కొవ్వాడ, పసుపాం లేఅవుట్లలో ఒక్కరు కూడా ఇంటి నిర్మాణం చేపట్టలేదు. దీంతో, ఈ ఏడు లేఅవుట్లను రద్దు చేయనున్నట్టు అధికార యంత్రాంగం చెబుతోంది. మెరకముడిదాం మండలం బుదరాయవలస, జి.మర్రివలస, ఉత్తరావల్లి తదితర పంచాయతీల్లో 916 మంది లబ్ధిదారులు ఇళ్ల స్థలాలను తిరస్కరించారు. గుర్ల మండలం పకీరుకిత్తలి, పాలవలస, రాగోలు, వల్లాపురం గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. బాడంగి మండలంలో 13 లేఅవుట్లు ఏర్పాటు చేయగా, అందులో కోటిపల్లి సహా ఆరు లేఅవుట్లలో 134 మంది ఇళ్ల స్థలాలను తిరస్కరించారు. ఇలా జిల్లాలోని మొత్తం 26 మండలాలకుగాను రామభద్రపురం, గజపతినగరం మినహా మిగిలిన అన్ని మండలాల్లోనూ స్థలాలు తిరస్కారణకు గురయ్యాయి. ఇక్కడ ఇళ్లు నిర్మించుకోవడానికి అవకాశం ఉందా? లేదా? ఈ ప్రాంతం నివాసయోగ్యమా? కాదా? అనేది పరిశీలించకుండా లేఅవుట్లు వేయడం, పారదర్శకత లోపించడం ఇందుకు కారణం. రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గంలోనే అత్యధికంగా సుమారు 1045 మంది తిరస్కరించడం గమనార్హం. కోర్టు కేసుల కారణంగా 12 మండలాల్లో లబ్ధిదారులు స్థలాలకు నోచుకోలేదు.
కొండపై ఇంటి స్థలం ఇవ్వడం వల్లే
కొండపై ఇంటి స్థలం ఇవ్వడంతో నాతో సహా 96 మంది ఇళ్లు కట్టుకోలేదు. అక్కడ నీటి సదుపాయంగానీ, రహదారి సదుపాయంగానీ లేదు. నివాస యోగ్యానికి ఏ మాత్రమూ అనుకూలంగా లేకపోవడంతో ఇక్కడ ఇల్లు కట్టుకోలేమని అధికారులకు విన్నవించాం. మాకు ప్రత్యామ్నాయ స్థలం కావాలని కూడా కోరాం.
-ఎస్.అప్పలనాయుడు, బుదరాయవలస, మెరకముడిదాం మండలం










