Sep 24,2022 09:51

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : జెన్‌కోకు వడ్డీల భారం పెరిగిపోతోంది. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో అత్యధిక వడ్డీ చెల్లిస్తుండటం ఆ సంస్థకు శిరోభారంగా మారింది. కేంద్ర ఆధీనంలోని పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి గత రెండేళ్లలో తీసుకున్న రుణానికి ఏకంగా 13.05 శాతం వడ్డీగా చెల్లించాల్సి వస్తోంది. ఇంత భారీ వడ్డీ ఎప్పుడూ లేదని ఆర్థికశాఖ అధికారులూ అంగీకరిస్తున్నారు. 2020 మార్చిలో రూ.522 కోట్లను టర్మ్‌ లోన్‌గా జెన్‌కో తీసుకుంది. 2020 అక్టోబరులో మరో రూ.522 కోట్లు, 2021 జూన్‌లో రూ.322 కోట్లు రుణాన్ని తీసుకుంది. దీనికి ముందుగా 12.05 శాతం వడ్డీ చెల్లిరచేందుకు ఒప్పందం కుదిరింది. అయితే ఈ రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వకపోవడంతో అదనంగా మరొక శాతాన్ని వడ్డీగా ఇవ్వాల్సి వచ్చింది. దీంతో మొత్తం వడ్డీ 13.05 శాతానికి చేరినట్లు జెన్‌కో పేర్కొంది.ఈ మొత్తాన్ని పిడి ఖాతాల ద్వారా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పలు సర్కారు అవసరాలకు ఖర్చు చేసింది. తొలి రూ.522 కోట్లను 2020 అక్టోబరులో జెన్‌కో పిడి ఖాతాల్లో జమచేయగా, దానిని 2021 జూన్‌లో ప్రభుత్వం తీసుకుంది. ఇక రూ.322 కోట్లను 2021 జూన్‌ 11న జెన్‌కో పిడి ఖాతాలో జమచేయగా, ఆ మొత్తాన్ని కేవలం మూడు రోజుల్లోనే ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు ఈ రుణ మొత్తాలకు సంబంధించిన వడ్డీ చెల్లించాల్సిన బాధ్యత జెన్‌కోపై పడింది. అందుకే అత్యవసరంగా రూ.83 కోట్లు విడుదల చేస్తే పిఎఫ్‌సికి చెల్లిస్తామంటూ జెన్‌కో అధికారులు ఆర్థికశాఖకు లేఖ రాశారు. సొంతంగా చెల్లించేందుకు తమకు ఆర్థిక స్తోమత లేదని కూడా లేఖలో స్పష్టం చేయడం గమనార్హం.