
కేంద్ర ప్రభుత్వం 'విద్యుత్ బిల్లు-2022' పేరుతో తీసుకురానున్న విద్యుత్ సంస్కరణలకు మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రయోగశాలగా మారింది. 2004కు ముందు టిడిపి ప్రభుత్వ కాలంలో విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణ ప్రయోగాలు జరిగాయి. నాడు నేరుగా ప్రపంచబ్యాంకు ఆదేశాలు అమలు చేయగా, నేడు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆదేశాలను అమలు చేస్తున్నారు. వినాశకరమైన విద్యుత్ సంస్కరణలకు నాడు, నేడు మన రాష్ట్రమే ప్రయోగశాలగా మారడం విషాదకరం. తెలుగుదేశం, వైసిపి పార్టీలు పరస్పరం ఎంత తీవ్రంగా వాదించుకుంటున్నప్పటికీ వీటి ఆర్థిక విధానాలు ఒకటే అనేందుకు బలమైన నిదర్శనం విద్యుత్ సంస్కరణ లను ఇద్దరూ ఒకేలా అమలు చేయడం. నాడు ప్రపంచ బ్యాంకు ఆదేశాలను, నేడు కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్క రణలను దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగా అమలు చేసింది అప్పుల కోసం, ప్రైవేట్ కంపెనీల లాభాల కోసం.
- రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ భారాలు
1998 వరకు ఒకటిగా వున్న ఆంధ్రప్రదేశ్ విద్యుత్ బోర్డు (ఎపిఎస్‌ఈబి) ను టిడిపి ప్రభుత్వం ముక్కలు చేసింది. ఇలా చేసినందుకు ప్రపంచ బ్యాంకు విద్యుత్ రంగ పునర్వ్యవస్థీకరణ పేరుతో రూ. 100 కోట్ల డాలర్ల రుణాన్ని ఇచ్చింది. అప్పటి వరకు విద్యుత్ కొనుగోలు ధరల నిర్ణయాధికారం రాష్ట్ర విద్యుత్ బోర్డుకే ఉండేది. ఈ బోర్డుకు ప్రభుత్వం జవాబుదారీగా వుండేది. అందువల్ల విద్యుత్ చార్జీలు పెంచితే ప్రభుత్వం పెంచినట్లుగా వుండేది కాబట్టి ఆ పని చేయడానికి ప్రభుత్వాలు భయపడేవి. సంస్కరణలలో భాగంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ద్వారా విద్యుత్ చార్జీలను పెంచడం జరుగుతుంది. విద్యుత్ సంస్కరణల వల్ల నాణ్యమైన కరెంట్, సరసమైన ధరకే అందుబాటులో వుంటుందన్నారు. నాణ్యత ఎంత బాగా వుందో ఇటీవల అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలంలో జరిగిన విద్యుత్ ప్రమాదమే నిదర్శనం. హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగి కూలీలు వెళ్తున్న ఆటో మీద పడి ఎనిమిది మంది మరణించారు. దీనికి కారణం ఆ తీగలను ఉడతలు కొరికేశాయని అధికారులు ప్రకటించారు. ఇదీ నాణ్యత! 2004 నుండి 2014 నాటికి పెరిగిన యూనిట్ ధర వల్ల రూ. 28,835 కోట్ల అదనపు భారం వినియోగదారుల మీద పడింది. ప్రస్తుత వైసిపి ప్రభుత్వం ఇంధన సర్దుబాటు చార్జీలు, ట్రూఅప్ చార్జీల పేరుతో గత నాలుగు సంవత్సరాల్లో రూ.25 వేల కోట్ల భారం వేసింది. విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రస్తుతం అవుతున్న ఖర్చులో దాదాపు 80 శాతం విద్యుత్ కొనుగోలు కోసం ఖర్చు అవుతుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తెస్తున్న విద్యుత్ సవరణ బిల్లు వల్ల రాష్ట్రంలో దళితులకు, పేదలకు అందుతున్న విద్యుత్ సబ్సిడీలు పూర్తిగా రద్దు అవుతాయి. వ్యవసాయానికి ఇస్తున్న ఉచిత విద్యుత్ మాయమవుతుంది. అదానీ సంస్థకు రూ.68 వేల కోట్ల కాంట్రాక్టు కోసం గృహాలకు, వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. ఫోన్‌లకు రీచార్జీ మొత్తం వేసుకున్నట్లు ముందస్తుగా డబ్బులు చెల్లించి విద్యుత్ కొనడం ఈ విధానంలో భాగం. ఇలా రైతులు చెల్లించాల్సిన డబ్బును మేము చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం కపటత్వం. గ్యాస్ సబ్సిడీ ఏమైందో ప్రజలకు అనుభవమే.
- అదనపు అప్పు కోసం
మన రాష్ట్రంలోని అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి కేంద్ర బిజెపి విధానాలను పోటీలు పడి బలపరుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఊబిలో వుంది. ఈ పరిస్థితులను అవకాశంగా తీసుకొని విద్యుత్ సంస్కరణలను మన రాష్ట్రంలో వేగంగా కేంద్రం అమలు చేయిస్తుంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 322 రోజుల పాటు మన రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేబదుళ్ల కింద చేసిన మొత్తానికి వడ్డీ కింద రూ. 111.72 కోట్లు కట్టాల్సి వచ్చిందని కాగ్ నివేదిక తెలిపింది. 2021-22 చివరి నాటికి మొత్తం రాష్ట్రం అప్పు రూ. 3,72,503 కోట్లు. నిబంధనలకు మించి అప్పు కావాలంటే విద్యుత్ సంస్కరణలను అమలు చేయాలని కేంద్రం ఒత్తిడి చేస్తుంది. 2021-22 సంవత్సరంలో విద్యుత్ సంస్కరణలను బాగా అమలు చేసిన పది రాష్ట్రాలకు రూ. 28,204 కోట్లు అదనపు అప్పులకు కేంద్రం అనుమతి ఇచ్చింది. మన రాష్ట్రంలో అమలవుతున్న విద్యుత్ సంస్కరణల వల్ల ఈ సంవత్సరం సుమారు రూ. పది వేల కోట్లు అదనపు రుణం పొందే 'భాగ్యం' రాష్ట్ర ప్రభుత్వానికి కలిగింది.
- విద్యుత్ (సవరణ) బిల్లు -2022
మనిషి జీవితంలోని అన్ని కోణాలకు విద్యుత్ ఒక ముఖ్యమైన అవసరం. దేశం యొక్క సామాజిక-ఆర్థిక అభివృద్ధి విద్యుత్ రంగ అభివృద్ధిపై ఆధారపడి వుంది. ఇలాంటి కీలకమైన విద్యుత్ రంగంలో తీసుకువచ్చే మార్పుల గురించి విస్తృతంగా చర్చ జరగాలి. పార్లమెంట్‌తో పాటు, విద్యుత్‌రంగ నిపుణులు, ముఖ్యంగా వినియోగదారులతో విస్తృతంగా చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. కాని కేంద్రంలో వున్న బిజెపి ప్రభుత్వం తాను తీసుకువచ్చే ఏ బిల్లుల పైనా కూడా పార్లమెంట్‌లో చర్చలు చేయడం లేదు. కొద్దిమంది కార్పొరేట్ అనుకూల వ్యక్తుల సలహాలు, తన మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్ ఆశీస్సులు వుంటే చాలనుకుంటుంది. అందుకే గతంలో బిఎస్‌ఎన్‌ఎల్, ఎల్‌ఐసి, విద్యాచట్టం, ప్రస్తుతం ఎలక్ట్రిసిటి రంగం ఏకపక్షంగా ప్రైవేటీకరణ విధానాలను అమలు చేస్తుంది. విద్యుత్ (సవరణ) బిల్లు-2003ను సవరించి కొత్త విద్యుత్ చట్టాన్ని తీసుకు రావాలని మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రైవేట్ కంపెనీలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనికి అనుగుణంగా 2014 నుండి కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. 2014లో కొత్త విద్యుత్ బిల్లు పేరుతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 2018లో బిల్లు తీసుకురావడానికి ప్రయత్నించింది. 2020లో మరోసారి కొన్ని సవరణలతో చట్టం చేయాలని చూసింది. ఈ సంవత్సరం పార్లమెంట్ సమావేశ ఎజెండాలో పెట్టకుండానే విద్యుత్ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. ఈ ప్రయత్నాలను పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు, 13 రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యుత్ ఉద్యోగులు ప్రతిఘటిస్తూ వస్తున్నారు. ఈ చట్ట సవరణ ప్రభుత్వ విద్యుత్ విధానానికే కాదు, దేశ భద్రతకు, అభివృద్ధికి ప్రమాదకరమని వారంతా గగ్గోలు పెడుతున్నారు. రాజ్యాంగం ప్రకారం విద్యుత్ రంగం ఉమ్మడి జాబితాలో వుంది. దీనిపై ఏదైనా మార్పులు చేయాల్సి వస్తే రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రా యాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. కాని వీటిని ఏమాత్రం ఖాతరు చేయకుండా విద్యుత్ సవరణలు తీసుకురావాలని గత తొమ్మిది సంవత్సరాలుగా బిజెపి ప్రయత్నాలు చేస్తున్నది. విద్యుత్ బిల్లు ఇంకా చట్టం కాకపోయినా అందులోని కీలకమైన వాటిని అమలు చేసేటట్లు రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి చేస్తున్నది.
- విద్యుత్ సవరణలు ఎవరి కోసం?
2001 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 44 శాతం కుటుంబాలకు విద్యుత్ అందుబాటులో లేదని, భవిష్యత్ అవసరాలకు సరిపడా విద్యుత్ ఉత్పత్తి జరగడంలేదని, వినియోగదారులు నాణ్యమైన విద్యుత్ పొందాలంటే ప్రస్తుతం వున్న ప్రభుత్వ విద్యుత్ రంగానికి పోటీ వుండాలని, ప్రస్తుతం ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థల్లో అసమర్థత వుందని, వాణిజ్య విధానం లేదని సాకులు చెప్పి విద్యుత్ సవరణలు చేస్తున్నారు. వాస్తవానికి గత కొన్ని సంవత్సరాలుగా పవన, సౌర విద్యుత్ ఉత్పత్తిలోకి పెద్ద సంఖ్యలో ప్రైవేట్ కంపెనీలు వచ్చాయి. ప్రస్తుతం వీటి ఉత్పత్తి 1.30 లక్షల మెగావాట్లు. ప్రైవేట్ కంపెనీలతో కేంద్రం చేసుకున్న ఒప్పందాల ప్రకారం 2030 నాటికి 4,30,000 మెగావాట్లకు విద్యుత్ ఉత్పత్తి పెరుగుతుంది. మన రాష్ట్రంలో 2015 లో సౌర విద్యుత్ ఉత్పత్తి 279 మెగావాట్లు కాగా, 2022 నాటికి 4,390.48 మెగావాట్లు, పవన విద్యుత్ ఉత్పత్తి 4,096.65 మెగావాట్లు. ఈ మొత్తం విద్యుత్ ఉత్పత్తి అమ్మకం జరపడానికి సరఫరా, పంపిణీలలో కూడా ప్రైవేట్ సంస్థలు రావాలి. అందుకు విద్యుత్ 2003 చట్టం అడ్డుపడుతుంది కనుక దాన్ని సవరించాలి. అందుకోసమే ప్రస్తుత విద్యుత్ సవరణలు. విద్యుత్ సరఫరా చేసే సంస్థలు వినియోగదారులకు ప్రభుత్వ, ప్రైవేట్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు అందుబాటులో వుంటాయి. దీనివల్ల వినియోగదారులకు ఏది ఇష్టమైతే దాని నుండి విద్యుత్‌ను కొని లాభపడవచ్చు అని విషపు గుళికలను తీపి పూతతో మింగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయి. ప్రైవేట్ సంస్థలు చేస్తామంటున్న విద్యుత్ సరఫరా కోసం వారు లైన్లు, స్థంభాల లాంటివేవీ ఏర్పాటు చేయరట! అనేక దశాబ్దాలుగా రాష్ట్ర ప్రభుత్వాలు తమ విద్యుత్ సంస్థల ద్వారా కష్టనష్టాలతో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి సృష్టించుకున్న లైన్లు, స్థంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లను ప్రైవేట్ సంస్థలు యథేచ్ఛగా ఉపయోగించుకోవడానికి 2022 విద్యుత్ సవరణ చట్టం చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త!
వ్యాసకర్త : వి. రాంభూపాల్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు