- కమర్షియల్ వినియోగం
- లెక్కగడుతున్న ట్రాన్స్‌కో
- పైగా వడ్డీలు, చక్రవడ్డీలు, ట్రూఅప్, అడ్జస్ట్‌మెంట్ బాదుడు
- లెక్కగట్టే మీటర్లు లేకుండానే బిల్లులా ?
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : కునారిల్లిపోయిన పంచాయతీలతో విద్యుత్‌శాఖ వాణిజ్య వ్యాపారం చేస్తోంది. వీధిలైట్లకు ఇతర అవసరాలకు వాడుకునే విద్యుత్‌కు యూనిట్‌కు రూ.9 చొప్పున వసూలు చేసింది. ప్రజా ప్రయోజనం ఉన్న వీధిలైట్లకు వాణిజ్యపరంగా లెక్కగట్టడం ఎంతవరకు సమంజసమని సర్పంచులు ప్రశ్నిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ఇప్పటి వరకూ ఏ గ్రామ పంచాయతీలోనూ వీధిలైట్ల వినియోగానికి సంబంధించి మీటర్లు లేవు. అయినా ఇన్ని యూనిట్లు వాడారనే పేరుతో వాణిజ్య వినియోగంగా పరిగణించి పంచాయతీల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు. విద్యుత్ బిల్లుల పేరుతో వరుసగా రూ.550 కోట్లు, రూ.238 కోట్లు, రూ.996 కోట్లు ఇలా మూడు విడతలుగా ప్రభుత్వం డబ్బులు వెనక్కు తీసుకుంది. బిల్లులు బకాయిలు కట్టేశామని సమాధానం ఇచ్చింది. అయితే ఫలానా పంచాయతీ ఇంత బిల్లు కట్టాలని గానీ, కట్టిందని గానీ వారికి ఎటువంటి నోటీసూ ఇవ్వలేదు. ఇవ్వకుండా బిల్లులు జమచేసుకోవడం విచిత్రం. పోనీ జమైనదానికి లెక్కలన్నా ఉన్నాయా అంటే అదీ లేదు. దీనిపై పంచాయతీ సర్పంచుల సంఘం కూడా కొత్త నిర్ణయానికి వచ్చింది.
పంచాయతీలో వ్యాపారం చేస్తున్న నేపథ్యంలో విద్యుత్ విభాగాన్ని కూడా వాణిజ్యఖాతాలో వేసి స్తంభాలు, విద్యుత్‌లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లకు పన్నులు వేయాలని నిర్ణయించారు. పంచాయతీరాజ్ చట్టంలో దీనికి ప్రొవిజన్ ఉందా? లేదా? అనే అంశంపైనా చర్చించారు. సెక్షన్ 263లో విద్యుత్ విభాగానికి సంబంధించిన అంశాలు ఉన్నా అందులో బిల్లుల వసూలుపైనే ఉంది. అయితే విద్యుత్‌శాఖకు పన్నులు విధించొచ్చా? లేదా? అనే అంశంపై స్పష్టత లేదు. వివిధ విభాగాలకు సంబంధించి యూజర్ ఛార్జీలు వసూలు చేసుకునే అధికారం పంచాయతీలకు ఇస్తూ పంచాయతీరాజ్ చట్టంలో పొందుపరిచారు. ఇదే చట్టంలో విద్యుత్ సరఫరాను ప్రజోపయోగమైన విభాగంలో ఉంచారు. చట్టంలో ప్రజోపయోగమైన వెలుతురు ఇచ్చే వీధిలైట్లు అని పేర్కొన్నా విద్యుత్‌శాఖ వాణిజ్యపరంగా బిల్లులు వసూలు చేయడంపై ఏమిటనే అంశంపైనా కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. అసలు బకాయిలు ఎంత, ఎంత కట్టాలి, ఇంకా ఎంతకట్టాలి అనే లెక్కలు వచ్చినప్పుడు ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని పంచాయతీరాజ్ ఛాంబర్ నాయకులు రాజేంద్రప్రసాద్ తెలిపారు.
యూజర్ ఛార్జీల్లో అవసరమైతే స్తంభాలకు పన్నులు వేసే అంశాన్ని తీర్మానం చేస్తామని, పంచాయతీ తీర్మానమే చెల్లుబాటవుతుందని పేర్కొన్నారు. వాణిజ్య విభాగం కింద బిల్లులు వేస్తూ, ట్రూఅప్, అడ్జస్ట్‌మెంట్ భారాలు వేస్తున్నారని, ఇదీ చాలదన్నట్లు బిల్లులకు వడ్డీలు, దానికి చక్రవడ్డీలు వేస్తున్నారని తెలిపారు. గుంటూరు జిల్లా మేడికొండూరు పంచాయతీకి రూ.40 లక్షల బకాయి ఉన్నట్లు పంపారని పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు జాస్తి వీరాంజనేయులు పేర్కొన్నారు. బిల్లులు కట్టామని చెబుతున్నా వడ్డీలు వేయడం ఏమిటని సర్పంచుల సంక్షేమ సంఘం నాయకులు కృష్ణమోహన్ ప్రశ్నించారు.










