Sep 23,2023 11:58

ప్రజాశక్తి - గండేపల్లి : పామాయిల్‌ తోటలో బోరు మరమ్మత్తు చేస్తుండగా 11 కెవి విద్యుత్‌ వైర్‌ తగిలి ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన కాకినాడ జిల్లా గండేపల్లిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. జగ్గంపేట మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన గళ్ల నాగరాజుకు గండేపల్లి మండలం ఉప్పలపాడులో పామాయిల్‌ తోట ఉంది. ఆ తోటలో బోరు మరమ్మతు చేసేందుకు కిర్లంపూడి మండలం బూరుగుపూడికి చెందిన బొదిరెడ్డి సూరిబాబు (45), జగ్గంపేటకు చెందిన కిల్లి నాగేశ్వరరావు (45) వెళ్లారు. నాగరాజు మనవడు గళ్ల బాబీ (25)తో కలిసి ఐరన్‌ గొట్టాలు పైకి ఎత్తే క్రమంలో పైన ఉన్న 11 కెవి విద్యుత్‌ వైర్లు తగలడంతో ముగ్గురూ విద్యాదాఘాతానికి గురై అక్కడికక్కడే మరణించారు. కిల్లి నాగేశ్వరరావుకు భార్య ఇద్దరు పిల్లలు, బొదిరెడ్డి సూరిబాబుకు భార్య ముగ్గరు పిల్లలు ఉన్నారు. గళ్ల బాబీ అవివాహితుడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను పెద్దాపురం తరలించారు.