న్యూఢిల్లీ : అటవీ సంరక్షణ (కన్జర్వేషన్) సవరణ బిల్లుపై 31 సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీలోని ప్రతిపక్షాలకు చెందిన ఆరుగురు సభ్యులు తమ అసమ్మతిని తెలియజేశారు. ముసాయిదా బిల్లులో భూ బదలాయింపు విస్తరణకు సంబంధించిన అనేక అభ్యంతరాలు లేవనెత్తినా..వివాదస్పదమైన ఈ బిల్లుకు ఎటువంటి మార్పులుచేర్పులు సూచించకుండానే పచ్చజెండా ఊపడం పట్ల వారు తమ అసమ్మతిని వ్యక్తం చేశారు. ఈ బిల్లును ఈ నెల 20న ప్రారంభమయ్యే వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టే వీలుంది. అసమ్మతి నోట్ ఫైల్ చేసినవారిలో కాంగ్రెస్ ఎంపీలు ప్రద్యూత్ బర్దోలి (లోక్‌సభ), ఫులో దేవీ నేతం (రాజ్యసభ), తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు జవహార్ సర్కార్ (రాజ్యసభ), సజ్దా అహ్మద్ (లోక్‌సభ), డిఎంకె ఎంపీలు టిఆర్ బాలు, ఆర్ గిరిరాజన్ ఉన్నారు. అటవీ సంరక్షణ చట్టం 1980కి సవరణలు చేయాలని ఈ బిల్లును కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. అటవీ భూములను అటవీయేతర వాటికి అడ్డుఅదుపూ లేకుండా బదలాయించడాన్ని, దుర్వినియోగం చేయడాన్ని అడ్డుకోవడానికి అటవీ సంరక్షణ చట్టం తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసి అటవీయేతర కార్యక్రమాలకు అటవీ భూములను బదలాయించడం ద్వారా కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టాలని మోడీ సర్కార్ అనేక సవరణలను ప్రతిపాదిస్తోంది. దీనిని నిరసిస్తూ ప్రతిపక్షాల సభ్యులు తమ అసమ్మతి తెలియజేశారు. దేశ సరిహద్దు రేఖ నుంచి 100 కిలోమీటర్ల వరకూ ఉన్న భూములను ఎటువంటి ఆంక్షలు లేకుండా బదలాయించేందుకు సవరణులు ప్రతిపాదిస్తున్నారని, వ్యూహాత్మక లైనర్ ప్రాజెక్టుల చేపట్టేందుకు వీటిని చేపడుతున్నట్లు పేర్కొంటున్నారని తృణమూల్, కాంగ్రెస్ ఎంపీలు పేర్కొన్నారు. సరిహద్దు భద్రత పేరిట కంపెనీలకు అటవీ భూములను దోచిపెట్టేందుకే ఈ ప్రతిపాదన చేస్తున్నారని, సరిహద్దు రేఖ నుంచి 100 కిలోమీటర్ల దూరం అని పేర్కొనడంలోనే వారి ఎత్తుగడను అర్థం చేసుకోవచ్చని వారు విమర్శించారు. ప్రత్యేకించి హిమాలయాలు, ట్రాన్స్ హిమాలయాలు, ఈశాన్య ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొనే ఈ ప్రతిపాదన చేసినట్లు వారు పేర్కొన్నారు. సరైన సంప్రదింపులు జరపకుండా ఇలాంటి నిర్ణయాలను అమల్జేస్తే జీవవైవిధ్యానికే ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
చట్టానికి సంస్కృతంలో పేరు
ప్రస్తుత ఫారెస్ట్ (కన్జర్వేషన్) యాక్ట్ పేరు మార్చేందుకు కూడా తాజా సవరణ బిల్లులో ప్రతిపాదించారు. ఇక నుంచి ఈ చట్టాన్ని వన (సంరక్షణ్ ఏవం సంవర్ధన్) అధినియమ్ అని సంస్కృతంలోకి పేరు మార్చేలా సవరణలను మోడీ సర్కార్ ప్రతిపాదించింది. దీనిపై ప్రతిపక్షాల సభ్యులందరూ ముక్తకంఠంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్కృత పదజాలాన్ని బలవంతంగా రుద్దాలని చూస్తే సహించే ప్రసక్తే లేదని డిఎంకె సభ్యులు గిరిరాజన్ హెచ్చరించారు. ఇలాంటి పదజాలం వినియోగించడం హిందీయేతర రాష్ట్రాల్లోని ప్రజలను విస్మరించడమేనిన బర్దోలి విమర్శించారు. అటవీ సంపదపై రాష్ట్రాలకు ఉన్న హక్కులను కూడా కాలరాసేందుకు మోడీ సర్కార్ ఈ సవరణ బిల్లు ద్వారా కుట్ర పన్నుతోందని డిఎంకె సభ్యులు విమర్శించారు. అటవీ, అటవీ సంరక్షణ అనేవి ఉమ్మడి జాబితాలోని అంశాలని, వీటి నిర్వహణ, నియంత్రణ అధికారాలు రాష్ట్రాలకే ఉన్నాయన్న సంగతి మోడీ సర్కార్ విస్మరిస్తోందన్నారు.










