న్యూఢిల్లీ : టయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎం) భారత మార్కెట్లోకి తన లగ్జరీ కార్ వెల్‌ఫైర్ ఎంపివిని విడుదల చేసింది. ఇందులో హై గ్రేడ్, విఐపి గ్రేడ్ అనే వేరియంట్లను ఆవిష్కరించింది. గురువారం దీనిని టికెంఎ సిఇఒ మసకాజు యోషిమురా, వైస్ ప్రెసిడెంట్ అథూల్ సూద్, ఎగ్జిక్యూటివ్ విపి టడసి అసజుమా ఆవిష్కరించారు. ఎక్స్ షోరూం ధరను రూ.1.19 కోట్లుగా నిర్ణయించింది. ఎక్స్‌టీరియర్ స్టైలింగ్, మూడు ఇంటీరియర్ థీమ్‌లతో దీన్ని రూపొందించినట్లు ఆ కంపెనీ తెలిపింది. విఐపి గ్రేడ్ ధరను రూ.1.30 కోట్లుగా ప్రకటించింది. 2.5 లీటర్ 4 సిలిండర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్‌తో ఆవిష్కరించిన ఈ కార్ లీటర్‌కు 19.28 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని వెల్లడించింది. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా, హిల్ అసిస్ట్ కంట్రోల్‌తో పాటు, వెల్‌ఫైర్ లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ మానిటర్, హైెబీమ్ అసిస్ట్ వంటి భద్రత ఫీచర్లతో దీన్ని తీసుకొచ్చింది. వచ్చే పండగ సీజన్ నుంచి డెలివరీలను ప్రారంభించనున్నామని ఆ కంపెనీ తెలిపింది.










