ఉపాధి కూలీలపట్ల బ్యాంకు అధికారుల తీరు మారకపోతే ధర్నా చేపడతాం : వ్య.కా.సంఘం

ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం (పశ్చిమ గోదావరి) : ఉపాధి కూలీల పట్ల బ్యాంకు అధికారుల తీరు మారకపోతే వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బ్యాంకు దగ్గర ధర్నా నిర్వహిస్తామని కూలీలు హెచ్చరించారు. ఉపాధి హామీ పర్యటనలో భాగంగా ... వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సోమవారం మాధవరం గ్రామంలో ఉపాధి పని ప్రదేశంలో పర్యటించి ఉపాధి కూలీలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కూలీలు మాట్లాడుతూ ... మాధవరంలో ఉన్న బ్యాంకు సిబ్బంది కూలీల పట్ల చాలా చులకన భావంగా మాట్లాడుతూ, కించపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి పని డబ్బులు జమ అయిందో, లేదోనని పోస్టింగ్ వేయమని అడిగితే అధికారులు వేయకుండా చులకనగా మాట్లాడుతున్నారని నాయకుల దఅష్టికి తీసుకువచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెల్లి సోమరాజు మాట్లాడుతూ ... గతంలో కూడా ఈ సమస్య వచ్చిందని అధికారులు వైఖరిలో మార్పు లేదని, వారి వైఖరి మారకపోతే వ్యవసాయ కార్మికులు బ్యాంకు దగ్గర ధర్నాకి సిద్ధపడతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షురాలు తెగిరిపల్లి పాపారత్నం, మండల కమిటీ సభ్యులు తానేటి నాగేశ్వరరావు, ఇంటి సత్యనారాయణ, ఉప్పాటి వెంకటరావు, లక్కాకుల సూర్యరావు, తదితరులు పాల్గొన్నారు.