ప్రజాశక్తి-కలక్టరేట్(కృష్ణా) : నారా చంద్రబాబు నాయుడుపై రాజకీయ ప్రేరేపిత కుట్రలో భాగంగా కక్ష పూరిత అరెస్ట్‌కు నిరసనగా బుధవారం మాజీ మంత్రి, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వమే.. ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తోందన్నారు. ఏపీలో వైసిపి అధికారం చేపట్టిన 2019 నుండి చీకటి రోజులు మొదలయ్యాయన్నారు.చంద్రబాబు అరెస్ట్ ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అన్నారు. వైసీపీకి అనుబంధంగా సీఐడీ, పోలీసులు పనిచేస్తున్నరన్నారు. జైల్లో చంద్రబాబు పడుకోవడానికి కనీస వసతులు కూడా కల్పించడం లేదన్నారు. ప్రజల్లో టిడిపికి వస్తున్న ఆదరణ చూసి జగన్‌కు భయం పట్టుకుందన్నారు. అందుకే ఎలాంటి ఆధారాలు లేకుండా కక్ష సాధింపుతోనే కుట్ర చేసి చంద్రబాబును జైలుకు పంపారన్నారు. రాష్ట్రంలో సంక్షేమాన్ని గాలికొదిలేసి ప్రతిపక్షాలపై కక్ష సాధింపులే లక్ష్యంగా జగన్ పనిచేస్తున్నరన్నారు. జగన్ జైలుకు వెళ్లొచ్చారని అందరినీ జైలుకు పంపాలని కుట్రలు చేస్తున్నాడు.చంద్రబాబు 45 ఏళ్లపాటు నిజాయతీగా ప్రజాసేవ చేసిన వ్యక్తి అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాల్లో ఎంతోమంది శిక్షణ పొందారని, శిక్షణ పొందిన ఎంతోమంది యువత ఉద్యోగాలు సాధించారని గుర్తు చేశారు. అవినీతి చేసినట్లు ఆధారాలుంటే చూపమనండి అంటే వైసీపీ ప్రభుత్వం పారిపోతుందని విమర్శించారు. జగన్ 16 నెలలు జైల్లో ఉన్నాడు, మరి ఆయన అనుమానితుడు కదా? జగన్ జైలుకు ఎందుకు పోయాడో సజ్జల చెప్పాలన్నారు. దమ్ముంటే మంత్రులు, సజ్జల చర్చకు సిద్ధమా? చెప్పాలన్నారు. సీఐడీ ఈ స్కామ్‌లో అధికారులను ఎందుకు చేర్చలేదు అని ప్రశ్నించారు. జగన్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎంపి జిల్లా అద్యక్షులు కొనకళ్ళ నారాయణ రావు మాట్లాడుతూ.. స్కామ్ జరిగిందని చంద్రబాబును అరెస్టు చేయడం దురదృష్టకరం అని స్కిల్ డెవలప్‌మెంట్ కేసుపై డిజెన్ టెక్ ఎండీ వివరణ కూడా వివరణ ఇచ్చారని గుర్తు చేశారు. అసలు ఒక్క మనిషి కూడా ఫిర్యాదు లేని కేసులో చంద్ర బాబు జైలుకు పంపి వారి కక్ష సాధించుకున్నరన్నారు. నిజ నిజాలు త్వరలోనే బయటకి వస్తాయని అప్పుడు ప్రజలందరూ జగన్‌ను చికొడతరాన్నారు. ఈ నిరసన దీక్షలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఎం వి.బాబా ప్రసాద్, పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.










