Sep 26,2023 21:46
  •  ఏడో రోజూ ఉత్సాహంగా సాగిన ఉక్కు రక్షణ యాత్ర

ప్రజాశక్తి - విలేకరుల యంత్రాంగం : ప్రజా పోరాటాలతో వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను అడ్డుకుంటామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం అన్నారు. సిపిఎం ఆధ్వర్యాన ఈ నెల 20న విశాఖలో ప్రారంభమైన ఉక్కు రక్షణ బైకు యాత్ర మంగళవారం అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో ప్రజలను చైతన్యపరుస్తూ సాగింది.ఏడో రోజు అల్లూరి జిల్లాలోని పాడేరు, హుకుంపేట, జి.మాడుగుల, చింతపల్లి మండలాల్లోనూ, అనకాపల్లి జిల్లా నర్సీపట్నం, పాయకరావుపేట మండలాల్లోనూ సాగింది. యాత్ర బృందానికి స్వాగతం పలికి.. తామూ ఉక్కు పోరాటంలో భాగస్వాములమవుతామని స్థానికులు సంఘీభావం తెలిపారు. ఆయా చోట్ల జరిగిన సభల్లో లోకనాథం మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగ సంస్థలతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. గిరిజన ప్రాంతాల్లో మోడీ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో ఎటువంటి అభివృద్ధి పనులూ చేపట్టలేదని, పరిశ్రమలను ఏర్పాటు చేయలేదని విమర్శించారు. గ్రీన్‌ ఎనర్జీ పేరుతో 60 వేల ఎకరాలను కార్పొరేట్‌ సంస్థలకు ధారాదత్తం చేసేందుకు పూనుకుంటోందని మండిపడ్డారు. ఆదివాసీలకు ఎల్లప్పుడూ ఎర్రజెండా అండగా నిలుస్తుందని భరోసానిచ్చారు. గిరిజనులకు హానికలిగించే నిర్ణయాలకు పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి వత్తాసు పలుకుతూ ప్రజలను ఎలా మభ్యపెడుతున్నారో వివరించారు. బైకు యాత్రలో సిపిఎం అల్లూరి జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స, నాయకులు చిన్నయ్యపడాల్‌, విశాఖ, అనకాపల్లి జిల్లా నాయకులు బి.జగన్‌, ఆర్‌.శంకరరావు, అడిగర్ల రాజు, కె.త్రిమూర్తులు రెడ్డి, ఎం.అప్పలరాజు ఎం.సత్యనారాయణ, పద్మ పాల్గొన్నారు.

We-will-save-steel-with-struggles-CPM