
ప్రజాశక్తి - ఉక్కునగరం (విశాఖపట్నం) : వైజాగ్ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ ఉద్యమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు కోరారు. స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు సోమవారానికి 963వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో స్టీల్ సిఒసిసిపి విభాగం కార్మికులు కూర్చున్నారు. వారినుద్దేశించి పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ మాట్లాడారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటువారికి అప్పగించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి ఎదురు తిరిగి పోరాడుతున్నామని, కార్మికులు, నిర్వాసితుల మద్దతుతో సుదీర్ఘ కాలంగా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు. అయినప్పటికీ మోడీ సర్కారు వెనక్కుతగ్గడం లేదన్నారు. ప్లాంట్‌పై రాష్ట్ర బిజెపి నేతలు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థల ద్వారానే దేశ, రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని చెప్పారు. దీక్షల్లో పోరాట కమిటీ నాయకులు వరసాల శ్రీనివాసరావు, టి.కనకరాజు, కర్రి బాబూరావు, కె.ఆనంద్ కుమార్, ఎస్‌కె.మొహిద్దిన్, కె.సుబ్బారావు, వై.శ్రీనివాసరావు పాల్గొన్నారు.