Oct 25,2023 21:42

ప్రజాశక్తి-ఉక్కునగరం (విశాఖ) : రాష్ట్రంలోని తీర ప్రాంత భూములపై కన్నేసిన అదానీ సంస్థ మరింత తెగబడుతోందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి ఆదినారాయణ తీవ్రంగా విమర్శించారు. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెంలోని స్టీల్‌ప్లాంట్‌ ఆర్చి వద్ద చేపట్టిన దీక్షలు బుధవారం నాటికి 986వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షా శిబిరంలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఇఎస్‌ఎఫ్‌, ఇఆర్‌ఎస్‌, సేఫ్టీ, ఇఎండి విభాగాల నాయకులు, కార్మికులు కూర్చున్నారు. దీక్షలనుద్దేశించి ఆదినారాయణ మాట్లాడుతూ అదానీ ఇప్పటికే గంగవరం పోర్టును ఆక్రమించుకొని తద్వారా విశాఖ ఉక్కుకు రావలసిన ముడి సరుకులపై అధిక పన్ను విధించి లబ్ధి పొందుతున్నారని, దీనికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆమోదముద్ర వేసిందని విమర్శించారు. ఈ దౌర్జన్యానికి వ్యతిరేకంగా నవంబర్‌ ఎనిమిదిన పెద్ద ఎత్తున పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధి యు రామస్వామి మాట్లాడుతూ భవిష్యత్తుపై గంపెడాశతో ప్రభుత్వ రంగ స్థాపనకు అప్పటి ప్రభుత్వాలకు స్థానిక రైతాంగం తమ భూములను ఇచ్చారని, వారి ఆశలు నెరవేరక పోగా చివరకు కార్పొరేట్‌ శక్తులకు అవి దారాదత్తమవుతున్నాయని అన్నారు. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై రాష్ట్ర ప్రభుత్వం మౌనం విడాలని కోరారు. రాష్ట్రంలోని భూములను అదాని సంస్థకు రాష్ట్ర ప్రభుత్వమే దగ్గర ఉండి అందిస్తోందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని కోరారు. దీక్షా శిబిరంలో విభాగాల ప్రతినిధులు గంగాధర్‌, రాజు, గోవింద్‌, కారు రమణ, రాంబాబు, బొంజు బాబు, లామ్‌ బ్రెట్‌, రమణ, వెంకటేష్‌, కోటయ్య, ఎంఆర్‌కె ప్రసాద్‌, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.