
- కొనసాగిన ఉక్కు రక్షణ బైక్ యాత్ర
ప్రజాశక్తి- యంత్రాంగం : వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ, రాష్ట్రాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణను అడ్డుకుని, పరిశ్రమను కాపాడుకుందామని సిపిఎం నాయకులు కోరారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం సిపిఎం చేపట్టిన ఉక్కు రక్షణ బైక్ యాత్ర ఆరోరోజు సోమవారం బొబ్బిలి నుంచి ప్రారంభమై రామభద్రపురం, గజపతినగరం, శృంగవరపుకోట మీదుగా అరకు చేరుకుంది. ఆయా సభల్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.రమాదేవి, కె.లోకనాధం, రాష్ట్ర నాయకులు జగ్గునాయుడు మాట్లాడారు. స్టీల్‌ప్లాంట్‌పై ఆధారపడి ఉత్తరాంధ్రకు చెందిన వేలాది మంది జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ప్లాంట్‌ను కాపాడుకునేందుకు అందరూ కలిసిరావాలని, ఉక్కు ఉన్నతిని ఇంటింటికీ తెలియజేయాలని కోరారు. ఉత్తరాంధ్రలో కొనసాగుతున్న యాత్ర విజయనగరం జిల్లా ఎస్.కోట నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లాలోకి ప్రవేశించింది. అనంతగిరి మండలం చిలకలగెడ్డ పంచాయతీ, వెంకయ్యపాలెం, కాశీపట్నం, శివలింగపురం, డముకు, బొర్రా జంక్షన్ మీదుగా అనంతగిరి మండల కేంద్రానికి చేరింది. ఆయా సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం, డి.రమాదేవి, అనంతగిరి జెడ్‌పిటిసి సభ్యులు దీసరి గంగరాజు మాట్లాడారు. త్యాగాలతో ఏర్పడ్డ ఉక్కును ఐక్యపోరాటాలతో కాపాడుకుంటామన్నారు. సుంకరమెట్ట వద్ద ఈ యాత్రకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.సురేంద్ర ఆధ్వర్యంలో గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అరకులోయలోని దండకారణ్య ఒకేషనల్ కాలేజీ వద్ద నిర్వహించిన సభలో కె.లోకనాథం, డి.రమాదేవి, అల్లూరి జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స మాట్లాడారు.