Aug 06,2023 21:32

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :యాపిల్‌ రైతులకు సహకార సంస్థల ద్వారా కేరళ మార్కెట్‌లో మద్దతు ధర కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ హామీ ఇచ్చారు. ఆదివారం నాడిక్కడ హరికిషన్‌ సింగ్‌ సుర్జీత్‌ (హెచ్‌కెఎస్‌) భవన్‌లో విజయన్‌ను యాపిల్‌ ఫార్మర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఎఫ్‌ఎఫ్‌ఐ) ప్రతినిధి బృందం కలిసింది. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మొహమ్మద్‌ యూసుఫ్‌ తరిగామి, రాకేష్‌ సిన్హా, ఎఎఫ్‌ఎఫ్‌ఐ కన్వీనర్‌ సోహన్‌ సింగ్‌ ఠాకూర్‌, ఎఐకెఎస్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్‌ ధావలే, విజూ కృష్ణన్‌, ఎఐకెఎస్‌ ఆర్థిక కార్యదర్శి పి. కృష్ణ ప్రసాద్‌ ఉన్నారు. జమ్ముకాశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లోని యాపిల్‌ రైతులకు లాభసాటి ధరను అందజేయడం కోసం కేరళ దేశీయ మార్కెట్‌లో సహకార సంస్థలతో మార్కెటింగ్‌ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసే అవకాశాలపై చర్చించింది. ఉత్పత్తి వ్యయం అనేక రెట్లు పెరిగి రైతులకు రాబడి తగ్గడంతో మూడు రాష్ట్రాల యాపిల్‌ రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని ఎఎఫ్‌ఎఫ్‌ఐ ప్రతినిధులు తెలిపారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సందర్భంగా, అమెరికా యాపిల్స్‌పై దిగుమతి సుంకాన్ని 70 శాతం నుంచి 50 శాతం వరకూ తగ్గించడంతో, అక్కడి నుంచి పెద్ద మొత్తంలో దిగుమతి అవుతాయని చెప్పారు. వ్యాపారులు, కమీషన్‌ ఏజెంట్లు, బ్రోకర్లు, కార్పొరేట్‌ కంపెనీల ఆధిపత్యం ఉన్న ప్రస్తుత మార్కెటింగ్‌ పద్ధతులతో యాపిల్‌ రైతు బలవంతపు విక్రయాల నుంచి బయటపడటానికి సహకార సంస్థల ఆధారంగా ప్రత్యామ్నాయ మార్కెటింగ్‌ వ్యవస్థను అభివృద్ధి చేయాలని భావిస్తున్నామన్నారు. విక్రయించిన ఉత్పత్తుల డబ్బు తరువాత ఎప్పటికో రైతులకు వస్తుందని, అది కూడా పూర్తిగా అందటం లేదని తెలిపారు. యాపిల్‌ రైతులు రైల్వే నెట్‌వర్క్‌ను ఉపయోగించి చండీగఢ్‌ నుంచి కొచ్చిన్‌కు 48 గంటల్లో రవాణా చేయవచ్చు, ఇది పండ్ల నాణ్యతను పెంచుతుందని తెలిపారు. యాపిల్‌ రైతులకు రాష్ట్రప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ హామీ ఇచ్చారు. ఎఎఫ్‌ఎఫ్‌ఐ కేరళలోని సహకార శాఖ మంత్రితో చర్చిస్తుందని, దీనికి సంబంధించి వివరణాత్మక ప్రాజెక్ట్‌ నివేదికను అందజేస్తుందని ఆ సంఘం నేతలు తెలిపారు.