Jun 06,2023 21:20
  • దేశంలో 4500 టచ్‌ పాయింట్లకు విస్తరణ

హైదరాబాద్‌ / న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి దేశ వ్యాప్తంగా 2,271 పట్టణాల్లో 4500 సర్వీస్‌ టచ్‌ పాయింట్లకు విస్తరించినట్లు ప్రకటించింది. హైదరాబాద్‌లోని రాంపల్లిలోలో నూతన నెక్సా సర్వీస్‌ సెంటర్‌ తెరవడం ద్వారా ఈ మైలురాయిని చేరుకున్నామని ఆ కంపెనీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సర్వీస్‌) పార్థో బెనర్జీ వెల్లడించారు. మంగళవారం నగరంలో సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (సర్వీస్‌) యసుహిరో కవయితో కలిసి బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో 326 టచ్‌ పాయింట్లు ఉన్నాయని తెలిపారు.2022-23లో కొత్తగా 310 సర్వీసు పాయింట్లను ప్రారంభించామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 350 తెరువాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. నగరాల్లో ్పతీ 10-15 కిలోమీటర్లకు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతీ 25 కిలోమీటర్ల పరిధిలో ఓ సర్వీస్‌ సెంటర్‌ అవసరం ఉందన్నారు.

  • బజాజ్‌ ఫైనాన్స్‌తో మారుతి జట్టు

బజాజ్‌ ఫైనాన్స్‌తో మారుతి సుజుకి కీలక ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా సులభంగా మారుతి వినియోగదారుల ఆటో రిటైల్‌ ఫైనాన్సింగ్‌ పరిష్కారాలు లభించనున్నాయని తెలిపింది. కార్లను సొంతం చేసుకోవాలనే ఫైనాన్సింగ్‌ ప్రక్రియ సులభతరం కానుందని పేర్కొంది. ఈ ఒప్పందంలో బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అనుప్‌ సహా, మారుతి సుజుకి మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌ ఇండియా సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ శశాంక్‌ శ్రీవాస్తవా పాల్గొన్నారు.