Feb 13,2023 08:28

          ఒక జన సమూహం ఫలానా వాళ్లు అని గుర్తించటానికి మొట్టమొదటి కొండ గుర్తు వారు మాట్లాడే భాష. మరి కాలక్రమేణా ఆ భాష వాళ్లు అనేక భాషలు నేర్చుకొని- అసలు భాషను, అదే అమ్మ భాషను వదిలేస్తే- వారు ఏమవుతారు? తమ తొలి సమూహం నుంచి దూరమవుతారు. మీరెవరు? అంటే- ఎవరో చెప్పుకోలేక దిక్కులు చూస్తారు.. తీర్థంలో తప్పిపోయిన చిన్న పిల్లాడిలా విలవిల్లాడతారు. అందుకనే- ప్రపంచంలోని ఏ తీరం చేరినా, బతకటానికి ఎన్ని భాషలు నేర్చినా- అమ్మ భాషను మర్చిపోకూడదు. మన మూలం ఎక్కడ ఉంది? అంటే- మన భాషాద్వారంలోంచి దర్శిస్తూ - 'అదిగదిగో ... అక్కడ ఉంది..' అని గర్వంగా చూపించాలి.
         తెలుగు భాషకు వెయ్యేళ్లకు పైబడిన చరిత్ర ఉంది. విస్తారమైన సాహిత్యం ఉంది. అనేక సాహిత్య ప్రక్రియలు శాఖోపశాఖలై వర్థిల్లాయి. జనజీవన స్రవంతిలోకి సజీవ పాయలుగా ప్రవహించాయి. పద్యాలూ పాటలూ, కథలూ కావ్యాలూ, నాటకాలూ నాటికలూ, ప్రబంధాలూ మహా గ్రంథాలూ ... ఆయా కాలాలను, జనజీవనాన్ని చిత్రించాయి. అన్నిటా తీయతీయని తెలుగు పలుకు వేకువల వెల్లువలా ప్రవహించింది. ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాషల్లో తెలుగు కూడా ఒకటి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ; దేశంలోనూ, దేశం బయటా దాదాపు 16 కోట్ల మంది తెలుగు మాట్లాడతారని ఒక అంచనా. దేశంలో హిందీ తరువాత అత్యధికులు మాట్లాడే భాష తెలుగే. తెలుగుకు ప్రాచీన భాష హోదా కూడా ఉంది. ఇవన్నీ మనం ఘనంగా చెప్పుకోవటానికి దోహదపడే సంగతులు. కానీ, తెలుగు వాడుక, వేడుక రోజురోజుకూ తరిగిపోతుందన్నది ఒక వాస్తవం. వెంటనే పెను ప్రమాదం లేకపోయినా- కొన్నేళ్లకు ప్రాభవం కోల్పోయే భాషల్లో తెలుగు కూడా ఉందనేది యునిసెఫ్‌ హెచ్చరిక.
         ఏ భాష అయినా ఎందుకు అవసరం అవుతుంది? అంటే- 'మన అవసరాలు తీర్చుకోవటానికి...'. ఒక సమూహపు ప్రజల అవసరాలు, జీవనం ఆ సమూహానికే పరిమితం అయినప్పుడు- ఆ సమూహాపు అమ్మభాషకు ఢోకా ఉండదు. ఇతర సమూహాలతో, ప్రాంతాలతో కలిసినప్పుడూ భాషకు ప్రమాదం వాటిల్లదు. మాటలను ఇచ్చిపుచ్చుకోవటం ద్వారా రెండు భాషలూ పరిపుష్టం అవుతాయి. ఇది భాష పుట్టినప్పటినుంచీ అనుభవంలో ఉన్నదే! కానీ, మన భాషకు మించి మరొక భాషకు ఆధిపత్య స్థానం ఇవ్వటం ప్రమాదకరం. అది క్రమేణా అమ్మభాష చెల్లుబాటును హరించి వేస్తుంది. ఇప్పుడు జరుగుతున్నది ఇదే!
           భాష ఒక భావ వ్యక్తీకరణ సాధనం అని సాధారణ దృష్టికి అనిపిస్తుంది. కానీ, దానితో మనకు అంతకుమించిన బంధం ఉంటుంది. మనవైన అవసరాలను మన భాష మాత్రమే అర్థం చేసుకుంటుంది. ఉదాహరణకు మనకు కుటుంబం చాలా పెద్దది. అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్య, మావయ్య, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, అత్త, పిన్ని, బాబాయి, పెద్దమ్మ, వదిన, మరదలు, బావ, మరిది ... ఇలా ఇలా ఇంకా చాలా చాలా. ఇంత పెద్ద తెలుగు అనుబంధాల పిలుపులను ఇంగ్లిషు వచ్చాక- కత్తిరించి పడేసింది! అమ్మమ్మ, నాన్నమ్మ కలిపి గ్రాండ్‌ మా అయిపోయారు. అత్తా పిన్ని, మావయ్యా బాబాయిలతో మనకు వేర్వేరు వరసల బంధం. ఆంటీ అంకుళ్ల పిలుపులతో మొత్తం ఒకటే వరస అయిపోయారు. వివరణ కావలిస్తే- మళ్లీ మనం మరోసారి అడగాల్సి ఉంటుంది. అమ్మ భాషలో అయితే- ఈ సమస్య లేదు. చిన్నత్త, పెద్దత్త, పెద్దన్నయ్య వంటి పిలుపుల్లో చాలా స్పష్టత ఉంటుంది. ఇలా మరింత నిర్ధిష్టంగా, ఇష్టంగా మన పిలుపుల్లోని బంధాలను అనుసంధానించుకోవొచ్చు. మనవైన కొన్ని విషయాలను ఇంగ్లిషులో చెప్పటం కష్టం. మన వ్యవసాయంలోని తట్టా, బుట్టా, కంకి, కొడవలి, నాగలి, అరక, ఏరువాక, తూర్పారబట్టడం, మారు గొప్పు; ఆటపాటల్లోని అలుపూ సొలుపూ వంటి పదాలకు, వ్యక్తీకరణలకు పరాయి భాషా పదాలు స్ఫురించటం అంత సులువు కాదు. మన జనజీవనంలోని అనేక అనుభవాల్లోంచి జాతీయాలు, నానుడులు, సామెతలూ పుడతాయి. అవి ఒక్కమాటలో మొత్తం వ్యవహారం అర్థమయ్యేలా చేస్తాయి. 'వెంకడు అద్దంకి వెళ్లినట్టు...', 'గుమ్మడి దొంగా అంటే- భుజాలు తడుముకున్నట్టు', 'జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలినట్టు', 'నల్లేరు మీద నడక', 'గోధూళివేళ' వంటి మాటలు మనకు ఒక పెద్ద దృశ్యాన్నే కళ్లకు కడతాయి. క్షణంలో విషయాన్ని అవగతం చేస్తాయి. వృత్తిపరంగా, సంస్క ృతిపరంగా, సామాజిక జీవనంపరంగా, ప్రాంతాల పరంగా- అనంతమైన పద సంపద, వాడుక మాటలూ మనకు పోగు పడి ఉన్నాయి. పరాయి భాషలో వ్యక్తీకరణ సాధ్యమవ్వొచ్చు కానీ, ఇంత లోతైన వాడుక సులభ సాధ్యం కాదు.
 

                                                             సొంత పలుకులోనూ ఆధిక్య ఘోష

ప్రపంచం మీద ఇంగ్లిషు ఆధిపత్యం ఉన్నట్టే- స్థానికీయ భాషలపైనా ఆ భాషలోని ఆధిపత్య తరగతుల ప్రాబల్యం, ప్రభావమూ ఉంటుంది. దానిని సవరించి, సరైన పద్ధతిలో వాడటానికి ప్రజాస్వామిక దృష్టి అవసరం అవుతుంది. తెలుగు గ్రామీణ ప్రాంతాల్లో 'నీచు' అనే మాట వాడుకలో ఉంది. ఒకప్పుడు 'మీది ఈ రోజు ఏం కూర?' అని అడిగితే- 'నీచు' అనే సమాధానం వచ్చేది. ఇప్పుడు 'ఎన్వీ' అనో, 'చికెన్‌ లేదా మటన్‌ అనో సమాధానం వస్తుంది. ఇక్కడ ఇంగ్లిషు పదాల వాడుక కన్నా కూడా 'నీచు' అనే తెలుగు పదమే అభ్యంతకరం. 'నీచు' అంటే నీచమైంది అని అర్థం. అది మాంసం తిననివారి ఏవగింపు వాడుక. వివక్షను గుర్తించిన తరువాత ఆ పదాన్ని పూర్తి వాడడం మానేయటమే ఉత్తమ పద్ధతి. కొన్ని కులాలను, మహిళలను తక్కువ చేసేవి, కొన్ని వృత్తులను హేళన చేసేవి మన అమ్మ భాషలోనూ బోలెడు సామెతలూ, పదబంధాలూ ఉన్నాయి. వాటన్నిటినీ వాడుకలోంచి తొలగించాలి. మనందరి భాషలా మన పలుకుబడిని సంస్క రించుకోవాలి.
 

                                                                   ఆంగ్లం కూడా అవసరమే !

అమ్మభాషను రక్షించుకోవటం అంటే- ఇంగ్లీషు అసలు వద్దనే ధోరణికి పోవటం కూడా పొరపాటు. అవునన్నా, కాదన్నా నేడున్నది హద్దులు చెరుగుతున్న ప్రపంచం. జీవిక కోసం, అవకాశాల కోసం ఎక్కడివారు ఎక్కడికైనా వెళ్లాలి. అక్కడ రాణించాలి. దానికోసం ఇతర భాషలు నేర్చుకోవటం అనివార్యం. ఆ అవసరానికి అనుగుణంగా సిద్ధపడుతూనే - అమ్మ భాష అక్కున పెట్టుకొనే విధినీ నిర్వర్తించాలి. ఈ పని ఇంటా, బయటా, బడిలో మూకుమ్మడిగా జరగాలి. దీనిలో ప్రభుత్వాలదే ప్రప్రథమ బాధ్యత. పిల్లలకు ప్రాథమిక విద్యను అమ్మభాషలోనే అందివ్వటం దాని తొలి మెట్టు. సొంత భాషలోనే మనం ఎక్కువ ఆలోచించగలం... ఎక్కువ ఊహించగలం.. ఎక్కువ నేర్చుకోగలం. ఇది అంతర్జాతీయంగా అనేక పరిశోధనల తరువాత విద్యావేత్తలు నిర్ధారించిన నిజం. తొలుత అమ్మ భాషలో నిర్మాణ సూత్రాలు తెలిస్తే- దాని ఆధారంగా ఇతర భాషలు నేర్చుకోవటం సులభం. పిల్లలకు మొదటినుంచీ ఆంగ్ల మాధ్యమం అలవాటు చేస్తే- మాతృభాషా పరిజ్ఞానం లేకుండా పోతుంది. ఇటీవల వెలువడ్డ అసర్‌ నివేదికలోని అంశాలు చాలా ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. మన రాష్ట్రంలో ఒకటో తరగతి పాఠాలను అంతకన్నా పెద్ద తరగతి విద్యార్థులు దాదాపు 70 మంది చదవలేకపోతున్నారట! మాధ్యమం అయోమయంలో మన విద్యావ్యవస్థ చెల్లిస్తున్న మూల్యం ఇది. ఆంగ్లం సహా అన్ని భాషలనూ మన విద్యార్థులకు నేర్పొచ్చు.. ఆ నేర్చుకోవటానికి ప్రాథమిక దశ నుంచే ఆంగ్లం మాధ్యమంగా ఉండనవసరం లేదు. ఈ సర్వే చేసిన హెచ్చరిక అదే !
           భాష అంటే- మాట్లాడడం ఒక్కటే కాదు; ఆ భాషా కళ్లద్దాలోంచి మన సంస్క ృతిని, సంబంధాలను, మూలాలను అర్థం చేసుకోవటం. ఆ పరిజ్ఞానం ఉండాలంటే- సంభాషణకు మించిన సాహిత్యం, చరిత్ర తెలియాలి. దానికి తెలుగు చదవడం, రాయటం తెలియాలి. ఈ అంశానికి సంబంధించే చాలా వేగంగా సమస్య ముంచుకొస్తోంది. తెలుగు మాట్లాడేవారు ఉన్నా- చదివేవారు, రాసేవారు తగ్గిపోతున్నారు. ఇప్పటికే తెలుగేతర ప్రాంతాల్లో ఈ సంఖ్య గణనీయంగా ఉంది. ప్రయివేటు విద్యాసంస్థల్లో ఆంగ్ల మాధ్యమం మూడు దశాబ్దాలుగా విస్తారంగా నడుస్తోంది. తరువాత ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆంగ్లమాధ్యమం మొదలైంది. ఈ చర్యలతో తెలుగు నేర్వని తరాలు చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ పరిణామాలు అమ్మభాషకు చాలా ప్రమాదకరమనేది భాషావేత్తలు, తెలుగు భాషాభిమానుల ఆవేదన, ఆందోళన. తల్లిదండ్రులు కోరుకుంటున్నారు కాబట్టి- ఆంగ్లమాధ్యమం పెట్టామని ప్రభుత్వ వాదన.
 

                                                                          పాలకులదే పాపం !

ఆంగ్ల మాధ్యమం పట్ల అంతటి ఆసక్తిని రేకెత్తించటంలో ఏళ్ల తరబడి పాలకులు సాగించిన నిర్లక్ష్యమే మూల కారణం. ప్రభుత్వ పాఠశాలలను అనేక రూపాల్లో నిర్వీర్యం చేయటం, కొత్త అవసరాలకు అనుగుణంగా వాటిని బలోపేతం చేయకపోవడంతో- తల్లిదండ్రులు ప్రయివేటు వైపు మొగ్గటం ప్రారంభించారు. వేలకు వేల ఫీజు భారాన్ని భరించి మరీ పిల్లలను ప్రయివేటు స్కూళ్లకు పంపుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో శరవేగంతో పెరిగిన కార్పొరేటు విద్యా సంస్థలు కూడా తెలుగు భాషను కొత్త తరాలకు అందకుండా చేశాయి. ఇప్పటికైనా పాలకులు మేల్కొనటం అవసరం. ప్రాథమిక విద్యను తెలుగులోనే అందించటం, తరువాత తెలుగు ఒక అంశంగా బోధించటం చాలా అవసరం. నూతన ప్రపంచానికి అనుగుణంగా మనం సన్నద్ధం అవుతూనే- సొంత ఉనికిని, అస్థిత్వాన్ని, భాషాసంస్క ృతుల పరిరక్షణ గురించి ఆలోచించాలి. ఈ బాధ్యతను మొక్కుబడిగా భావిస్తే- తెలుగునేలలో తెలుగు తెలియని తరాలు చాలావేగంగా పుట్టుకొస్తాయి. అమ్మభాష బలంగా లేని సమాజంలో పరాయి సంస్క ృతి ప్రవేశించటం చాలా సులభం. సొంత విలువలు లేనిచోట ప్రతి కొత్త ధోరణీ అనుసరించదగిందిగానే కనిపిస్తుంది. భాష, సంస్క ృతి సొంతవి కానప్పుడు, ఉన్నా బలహీనంగా ఉన్నప్పుడు- మనం మనలా లేనట్టే! మన మనుగడ మన చేతిలో లేనట్టే !
 

- సుజయ సాహితి