Jul 31,2023 07:29

లోయల్లో మీరు
మాయల పకీరుల్లా
కొండమేకల్ని పట్టుకొని
కొట్టుకు తింటున్నారు
కోరిక తీర్చుకుంటున్నారు
మేము ఆదివాసీలము
అడవితల్లి బిడ్డలం
కొండకోనల్లో బతికే కుకీలం
మీ ఆగడాలకు అదుపే లేదు
కాగడాలై కదులుతున్నాం
మీ కళ్ళల్ల బియ్యంపొయ్యడానికి
మీ కండకావరం కాల్చడానికి ...
శ్రీ శ్రీ శ్రీ
మీకు మతం పిచ్చి పట్టుకుంది
మన్యం మీద కళ్ళు బడ్డాయి
మీ మూకల్ని మా మీదికొదిలి
మా పీకల్ని కోస్తున్నారు
శిలువ మందిరాలను
చిందర వందర చేస్తున్నారు
మా గుడిసెల మీద
ఏనుగులై పడిపోయి
పీనుగుల్ని చేస్తున్నారు
కాగడాలై కదులుతున్నాం
మీ కాటిల కంపలెయ్యడానికి
మీ పోత్రం బొమ్మల్లించడానికి ...
శ్రీ శ్రీ శ్రీ
తెలిసిపోయింది
ప్రపంచానికి మీ కుటిల నీతి
రోజు రోజుకూ
వెలిసిపోతంది నీ రాజనీతి
ఒక్కసారి నిన్ను నువ్వు
అద్దంలో చూసుకో
నిన్ను కన్నది ఆడదని తెలుసుకో
కాగడాలై కదులుతున్నాము
నీ నులుపు తీసి పలుపులెయ్యడానికి
నీ పొగరు తీసి పొంగడాలు ఒండదానికి ...
శ్రీ శ్రీ శ్రీ
మీము ఆడోల్లం అపర కాలికలం
దారిపొడుగునా వన మూలికలం
దారి చెరపాలనుకుంటే
దూలగుండు మొక్కలం
మీము
నెయ్యానికి స్వాగతం పలికితే
మీరు
కయ్యానికి కాలు దువ్వుతున్నారు
కాగడాలై కదులుతున్నాము
మీ ఆటలింక సాగవు
కదిలింది కందిరీగల దండు.
శ్రీ శ్రీ శ్రీ
పరాయి ఆడోళ్ళ
పరువు తియ్యాలనుకుంటే
రావణాసురుల్లా
మీకు రాకతప్పడు చావు
మా కోపానికి మీరు
శాపగ్రస్తులవ్వడం న్యాయం
మా కంటిముందల మీరు
చంటిపిల్లలవ్వడం ఖాయం
ఏ మతగ్రంథం తిరగేసినా
చెడ్డవాళ్లకు చావే ఆఖరి గతి !
 

- చింతా అప్పల నాయుడు
9441713185