May 26,2023 21:50

\- పని ప్రదేశంలో మెడికల్‌ కిట్లు అందబాటులో లేవు
- మంచినీళ్లూ ఇవ్వడంలేదు
- ఎపి వ్యవసాయ కార్మిక సంఘం నేతల ఎదుట ఉపాధి కార్మికుల ఆవేదన
ప్రజాశక్తి-యంత్రాంగం:
గ్రామాల్లో చెరువులు వద్ద ముళ్లపొదల్లో పనిచేస్తున్న సందర్భంలో పాములు, తేళ్లు కరిచి ప్రమాదాల భారినపడుతున్నామని ఉపాధి కార్మికులు వాపోయారు. పని ప్రదేశంలో మెడికల్‌ కిట్లు, పనిముట్లు, ప్లే స్లిప్పులు ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండల్లో పని చేస్తున్నా కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వడంలేదని తెలిపారు. ఎపి వ్యవసాయ కార్మిక సంఘం నేతలు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్రవారం పర్యటించారు. ఉపాధి కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఏలూరు జిల్లా పెదవేగి మండలం రామసింగవరం, కూచింపూడి, న్యాయంపల్లి గ్రామాల్లో ఉపాధి పని ప్రదేశాలను వ్యకాస రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ.రవి, సంఘం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ ఉపాధి కార్మికులతో మాట్లాడారు. పని ప్రదేశాల్లో ప్రమాదాలకు గురవుతున్నామని, మెడికల్‌ కిట్లు అందుబాటులో లేవని, తాగేందుకు మంచినీళ్లు కూడా ఇవ్వడంలేదని నేతల ఎదుట వాపోయారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ పని ప్రదేశంలో గాయపడిన ఉపాధి కార్మికులకు ప్రభుత్వం ఉచిత వైద్యం అందించాలని డిమాండ్‌ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలంలోని పెర్కిపాలెం, తాడేపల్లిగూడెం మండలం అప్పారావుపేట, గొల్లగూడెం, పోడూరు మండలం జగన్నాధపురంలో పని ప్రదేశాలను నేతలు పరిశీలించారు. రెండు పూటలా పని విధానం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అనకాపల్లి జిల్లా ఎస్‌.రాయవరం మండలం జెవి.పాలెంలో, కృష్ణా జిల్లా ఉంగుటూరు, గన్నవరం, ఘంటసాల, మోపిదేవి, మచిలీపట్నం రూరల్‌, గుడివాడ, కంకిపాడు మండలాల్లో ఎపి వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు నాయకులు పర్యటించారు. సమస్యల పరిష్కారం కోసం చేపట్టే ధర్నాలో ఉపాధి హామీ కార్మికులు పాల్గనాలని కోరారు.
ఉపాధి హామీ ఎపిఒపై చర్యలు తీసుకోవాలి
పిడికి ఎపి వ్యకాస వినతి
ఉపాధి హామీ పథకంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యాన శుక్రవారం డ్వామా పిడి ఎ.రాముకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ.రవి మాట్లాడారు. ఏలూరు జిల్లా పెదవేగి, దెందులూరు, లింగపాలెం, చింతలపూడి, టి.నర్సాపురం మండలాల్లో అసిస్టెంట్‌ ప్రోగ్రామింగ్‌ ఆఫీసర్‌ కనుసన్నల్లోనే కార్మికుల నుండి డబ్బు వసూళ్ల దందా సాగుతోందన్నారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లు డబ్బులిస్తేనే మస్తర్లు వేస్తామని చెప్పడం దుర్మార్గమన్నారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లు, మేట్లు కార్మికులను వేధిస్తున్నారని తెలిపారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.