
కుల, మతాల అడ్డుగోడలు చెరిపేస్తూ.. చెయ్యి చెయ్యి కలుపుకుని, భుజం భుజం రాసుకుంటూ తిరిగే బాల్యం వారిది. ప్రేమ, ఆప్యాయతల కలబోతతో, కల్మషం లేని నవ్వులతో తిరుగాడే పసివారు వారు. ఆ పసిహృదయాల్లో ఉన్న అసమానతలను, అపోహలను పారదోలుతూ, పిల్లల మధ్య స్నేహం, సౌభ్రాతృత్వం, సామరస్యం వెల్లివిరిసేలా చేసే బాధ్యత ఉపాధ్యాయులది. కానీ, ఇటీవల ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్‌లో జరిగిన దారుణం సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. వైరల్ అయిన వీడియో ప్రకారం ... మతం పేరుతో ఓ ముస్లిం పిల్లవాడి గుణగుణాలు బేరీజువేసి, క్రమశిక్షణ పేరుతో తోటి హిందూ పిల్లలతో చెంపలు పగలగొట్టించారు స్కూలు ఉపాధ్యాయిని. ఆ సమయంలో ఆమె పలికిన ప్రతి మాట మతోన్మాదాన్ని నరనరాన ఒంటబట్టించుకున్న ఓ వర్గానికి వీనులవిందుగా ఉంటే, కాళ్లకింద భూమి కంపించినట్లు మరో వర్గం వణికిపోయింది. అందుకే పిల్లల మధ్య అంతరాలు చెరిపేందుకు వారి మధ్య సయోధ్య నెరిపేందుకు వారు ఆగమేఘాల మీద ముజఫర్ నగర్ చేరుకున్నారు.

ఘటన జరిగిన రోజు నుండి ఇంతటి అమానుషానికి ఆ పసి హృదయాలు ఎంతలా తల్లడిల్లాయో.. దెబ్బలు తిన్న పిల్లవాడికి ఒక రకం భావోద్వేగం ఉంటే దెబ్బలు కొట్టిన పిల్లలు తమ స్నేహితుణ్ని కొట్టామని ఎంతలా మదనపడ్డారో.. ఈ ఘటన తాలుకూ చేదు అనుభవాలకు ఎందరో కలత చెందారు. అటువంటి వారిలో ఒకరైన రైతు సంఘం నాయకుడు రాకేష్ తికాయత్ ఒక అడుగు ముందుకేసి, ఆ పిల్లల ఇంటికి వెళ్లారు. అప్పుడు అక్కడ.. చోటుచేసుకున్న ఉదంతం చూసి ఇప్పుడు ఎన్నో హృదయాలు తేలికపడ్డాయి.
మతం అడ్డుగోడలు, అవి సృష్టించే మారణహోమాలు తెలియని ఆ పిల్లలతో వారికి అర్థమయ్యే భాషలో మాట్లాడారు పెద్దలు. చెంపదెబ్బలతో ఎర్రబడిన బుగ్గలతో తల్లి కొంగుచాటులో తలదాచుకుంటున్న ఆ ముస్లిం పిల్లవాడిని ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు. కొట్టిన పిల్లలను పిలిపించారు. వారంతా రోజూ ఆడుకునేవారే.. కలిసిమెలిసి తిరిగేవారే.. అందుకే తమ స్నేహితుడు బాధ పడుతుంటే చూస్తూ ఊరుకోలేకపోయారు. 'టీచరు కొట్టమందనే కొట్టాం.. నువ్వంటే మాకు ఏం కోపం లేద'ంటూ స్నేహితుడిని అమాంతం దగ్గరకు తీసుకున్నారు పిల్లలు. అంతటితో ఆగలేదు, గట్టిగా కౌగిలించుకుని తమ ప్రేమను వ్యక్తపరిచారు. ఇది కదా పిల్లల మధ్య ఉండాల్సింది. పెద్దలు, ఉపాద్యాయులు నేర్పించాల్సింది !
బిడ్డలు తప్పు చేస్తే తల్లిదండ్రులు, విద్యార్థులు పొరబాటు చేస్తే ఉపాధ్యాయులు దండించడాన్ని ఎవరూ కాదనరు. కానీ రంగు, జాతి, కులం, మతం పేరుతో పేర్లు పెడుతూ దూషించడం క్షమించరాని నేరం. పైగా ఒకరిపై ఒకరికి విద్వేషం కలిగేలా చర్యలు తీసుకోవడం సహించరాని ఘోరం. ఈ విద్వేషం వారి పసి మనసుల్లో చెరగని ముద్ర వేస్తుంది. అది ఎంతటి అమానుషానికైనా దారి తీస్తుంది. ఇప్పుడు జరిగిన ఘటన తాలూకూ విద్వేషం పెద్దవాళ్ల మధ్య రగిలితే.. 30 ఏళ్ల క్రితం ఇదే ముజఫర్ నగర్‌లో జరిగిన మారణహోమం వారి కళ్ల ముందే ఉంది.
అటువంటి ఘోరాలు మళ్లీ అక్కడ పునరావృతం కాకుండా రైతు సంఘం నేతలు, సహృదయులు చూపిన చొరవను ఇప్పుడు అందరూ స్వాగతిస్తున్నారు.