రేపు రాసే కవిత్వం కోసం
ఈవాళ నిద్రపోను
రాసిన కవిత్వం ఎవరిదైనా
ఏ క్షణమూ తప్పి పోనీయను
అది నన్ను బతికించే తోవ
పక్షులు ఏ నీటి జాడని వెతుకుతాయో
అది పసికట్టే వేటకాడ్ని
చేపలు పట్టే కాలాన్నీ, గాలాన్నీ
పలక మీద దిద్దుకొనే పిల్లవాడిని!
క్షమించండి నన్ను
మీ కవిత్వం కోసం నావి
ఎన్ని వెతుకులాటలో
అందులో కవిత్వం లేకపోతే
ధర్మామీటరులాగ రీడింగ్
చూపించే వెర్రివాడిని
చాలామంది కవులకి
నేనంటే అందుకే కోపం ..!
వాడుకొనే వాళ్ళకి
మన్నికైన తివాచీని!
నాకుగా నేను కవిత్వం రాయను
అది వచ్చి వాలవల్సిందే!
ఏ ఋతువులో అయినా
ఏ క్షణంలో అయినా
పక్షిలా ఏదో పాడుకొనే
సంచారిని నేను ...
నా గూటిలో ఎన్ని
సంక్షోభాల్ని పొదిగానో!
చాలు ఈ రాత్రిని తాగి
నా చషకం మీ కోసం దాచిపెట్టి పోతాను!
- సాగర్ శ్రీరామకవచం
98854 73934