- బిల్లులు చెల్లించకపోవడంతో కరెంటు నిలిపివేత
- అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వాడుతున్న పంటలు
- ఆందోళనలో రైతాంగం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో హంద్రీనీవా ప్రాజెక్టుకు కరెంటు సరఫరా నిలిపివేశారు. దీంతో ప్రాజెక్టు ఆయుకట్టకకు నీటి సరఫరా నిలిచిపోయింది. కరెంటు సరఫరా నిలిపివేసి రెండు వారాలు గడుస్తున్నా ప్రభుత్వ యంత్రాంగంలో నామమాత్రపు చలనం లేదు. పైగా వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి నీటి సరఫరా నిలిపివేసినట్టు స్థానిక రైతులను మభ్య పెట్టారు. కొద్ది రోజులుగా వర్షాలు లేక పంటలు వాడుతున్నా నీటిని విడుదల చేయకపోవడంతో కరెంటు సరఫరాను నిలిపివేసిన సంగతి వెలుగులోకి వచ్చింది. అధికారుల ఈ నిర్లక్ష్య వైఖరిపై రైతాంగంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. హంద్రీనీవా ప్రాజెక్టు కింద కర్నూలు జిల్లాలో 40వేల ఎకరాలు, అనంతపురం జిల్లాలో లక్ష ఎకరాలకుపైగా ఆయకట్టు వుంది. మొక్కజొన్న, పత్తి, వేరుశనగ, వరి, మిరప, తదితర పంటలను సాగుచేశారు. ఇందులో ఇప్పటికే పంటి చేతికి వచ్చిన మొక్కజొన్న పంటకు మినహా అన్ని పంటలు నీరు అవసరం వుంది. నీరులేక వాడుముఖం పట్టాయి. కళ్లెదుటే పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఎంత బకాయి...?
హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు కింద దాదాపు 320 కోట్ల రూపాయలు, మచ్చుమర్రి ఎత్తి పోతల కింద 57 కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు ఉన్నాయి. ఈ మొత్తాన్ని చెల్లించాలని విద్యుత్‌సంస్థలు పదేపదే కోరుతున్నా ఫలితం కనిపించలేదు. దీంతో రెండు వారాల క్రితం కరెంటు సరఫరాను నిలిపివేశారు. ప్రభుత్వం చెబితే బకాయిల చెల్లింపుతో నిమిత్తం లేకుండా కరెంటు సరఫరా అయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశలోనూ చర్యలు తీసుకోలేదు. మరోవైపు హంద్రీనీవా ప్రాజెక్టు పంపుల నిర్వహణ పనులు చేస్తున్న కాంట్రాక్టరుకు రూ 32కోట్ల బకాయి వుంది. ఆ బకాయిని కూడా చెల్లించాలని, లేని పక్షంలో కరెంటు పునురుద్దరణ జరిగినా పైపుల నుండి నీటి సరఫరా జరగదని కాంట్రాక్టర్ చెబుతున్నట్లు సమాచారం. దీంతో అధికారులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
తక్షణం నీటిని వదలాలి : వి. రాంభూపాల్
హంద్రీనావా ప్రాజెక్టు నుండి తక్షణం నీటిని విడుదల చేయాలని అనంతపురం జిల్లా సిపిఎం కార్యదర్శి వి. రాంభూపాల్ డిమాండ్ చేశారు. వర్షాలు ఎక్కువ వున్నాయని నీటిసరఫరాను నిలిపేసిన ప్రభుత్వం ఇపుడు వర్షాలు లేక పంటలు వాడుముఖం పడుతున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రాజెక్టుకు సంబందించిన విద్యుత్‌బకాయిలను చెల్లించి నీటి సరఫరాను పునరుద్దరించకపోతే రైతాంగంను సమీకరించి ఆందోళలను చేపడతామని హెచ్చరించారు.










