Oct 13,2023 11:22
  • ఉత్తిపోతలుగానే వేదవతి ఎత్తిపోతలు
  • హామీల్లోనే కర్నూలు జిల్లా ప్రాజెక్టులు

ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి : కర్నూలు జిల్లాలో ప్రాజెక్టులకు అడుగులు పడడం లేదు. గుండ్రేవుల ప్రాజెక్టు పురోగతిలేకపోగా, వేదవతి ఉత్తిపోతలుగానే మిగిలిపోయింది. కర్నూలు, కడప జిల్లాలకు మేలు కలిగిలేలా రూపొందించిన గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన చర్యలేవీ ఇప్పటి వరకూ మొదలు కాలేదు. కర్నూలు జిల్లా సుంకేసుల దగ్గర తుంగభద్ర నదిపై 1.20 టిఎంసిల సామర్థ్యంతో 1865లో అప్పటి పాలకులు సుంకేసుల జలాశయాన్ని నిర్మించారు. ఈ బ్యారేజీకి అనుసంధానంగా కర్నూలు-కడప (కెసి) కాలువ నిర్మితమైంది. జల రవాణా కోసం నిర్మించిన ఈ కాలువను స్వాతంత్య్రం అనంతరం సాగునీటి కాలువగా మార్చారు. కృష్ణా వాటర్‌ డిస్ప్యూట్‌ ట్రిబ్యునల్‌ 31.90 టిఎంసిల నీటి వాటాను కేటాయించింది. దీని పరిధిలో కర్నూలు, కడప జిల్లాలో 2.65 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. సుంకేసుల సామర్థ్యం తక్కువ కావడంతో తుంగభద్రకు వరద వస్తేనే కాలువకు సాగునీరు అందుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు సాగునీటి నిపుణులు, విశ్రాంత ఇంజనీర్‌ సుబ్బరాయుడు సుంకేసుల రిజర్వాయర్‌ ఎగువన గుండ్రేవుల జలాశయం నిర్మాణానికి రూపకల్పన చేశారు. కర్నూలు జిల్లాలోని సి.బెళగల్‌, నందవరం, తెలంగాణలోని రాజోలి ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టును నిర్మించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. గుండ్రేవుల జలాశయం నిర్మాణం జరిగితే 20 టిఎంసిలు నిల్వ చేయవచ్చు. వరదలేని సమయంలోనూ ఈ నీటిని వాడుకోవచ్చు. గుండ్రేవులకు సంబంధించి గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా శ్రద్ధ పెట్టడం లేదు. వైసిపి ప్రభుత్వం వచ్చాక ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్‌లలోనూ గుండ్రేవులకు నిధులు కేటాయించకపోవడంతో జిల్లా ప్రజల ఆశలు అడియాశలయ్యాయి.
           కరువుకు నిలయమైన ఆలూరు ప్రాంతంలో పొలాలు పచ్చబడాలన్న ఉద్దేశంతో వేదవతి నది పరిధిలో నిర్మించిన ఎత్తిపోతలు ఉత్తిపోతలుగా మారాయి. వేదవతి నది పరిధిలో అమృతాపురం, జె.హోసళ్లి, సిద్ధాపురం వద్ద మూడు ఎత్తిపోతల పథకాలు 2008లో నిర్మించారు. నిర్వహణలో లోపాలు, అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడంతో ఈ పథకాలు ఏడాదికే నిరుపయోగంగా మారాయి. పథకం ప్రారంభంలో వేసిన గొట్టాలు దెబ్బతిన్నాయి. ఒక్కో ఎత్తిపోతల కింద 500 నుంచి 600 ఎకరాల ఆయకట్టు ఉంది. మరమ్మతులకు నిధులు వెచ్చించి పునరుద్ధరిస్తే తామే వాటిని కొనసాగించుకుంటామని రైతులు వేడుకుంటున్నా పట్టించుకొనేవారు కరువయ్యారు.

22

                                                                           ప్రాజెక్టులను పూర్తి చేయాలి

వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టులను పూర్తి చేయాలి. వేదవతిని 3 టిఎంసిలు కాకుండా బచావత్‌ ట్రిబ్యునల్‌ చెప్పిన ప్రకారం 8 టిఎంసిలతో ప్రాజెక్టును నిర్మించాలి. అవసరమైన నిధులను తక్షణమే కేటాయించాలి. భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి. గుండ్రేవుల డిపిఆర్‌ మాత్రం పూర్తి చేశారు. దానిపై కనీస కదలిక లేదు. అది పూర్తయితే సాగు, తాగునీటికి ఉపయోగకరంగా ఉంటుంది.
                                                                        - జి.రామకృష్ణ, ఎపి రైతు సంఘం కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి