- శైలంలో విద్యుత్‌తో 42వేల క్యూసెక్కులు దిగువకు
- పోతిరెడ్డిపాడు నుంచి ఎట్టకేలకు 12వేల క్యూసెక్కులు విడుదల
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఆగస్ట్ నెలలోకి వచ్చినా గోదావరి పరివాహ ప్రాంతంలో మినహా మిగిలిన ప్రాంతాల్లో నీటి లభ్యత లేకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. సాధారణంగా ఆగస్ట్ నాటికి కృష్ణానదిపై రాష్ట్రానికి ఎగువన వున్న అన్ని ప్రాజెక్టుల్లోకి నీరు చేరి దిగువకు వరద వచ్చేది. ఈ ఏడాది ఎగువన ఆల్మట్టి మినహా కృష్ణానది, దాని ఉపనదులు అయిన తుంగభధ్ర, ఉజ్జయిని ప్రాజెక్టుల్లో ఇప్పటికీ పూర్తిస్థాయిలో నీరు రాని పరిస్ధితి వుంది. దీంతో రాష్ట్రంలో మొదటి ప్రాజెక్టు అయినా శ్రీశైలం నీటిమట్టం నిరాశాజనకంగా తయారైంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి నీరు రాకపోయినా, ఆలస్యం అయినా రాయలసీమ జిల్లాల్లోని హంద్రీనీవా సుజల స్రవంతి, కెసి కెనాల్, ఎస్‌ఆర్‌బిసి, తెలుగుగంగల కింద ఆయకట్టుకు ముప్పు ఏర్పడే అవకాశం వుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట కాల్వలకు నీటి విడుదల ఆలస్యమైతే ఖరీఫ్ దిగుబడులపై ప్రతికూల ప్రభావం పడుతుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 865 అడుగుల వద్ద వుంది. సామర్థ్యం 215 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 122 టిఎంసిలుగా వుంది. శ్రీశైలంలోకి ఇన్‌ఫ్లోస్ 40,958 వుంటే సాగునీటిని విస్మరించి 42వేల క్యూసెక్కులను విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువకు వదులుతున్నారు. శ్రీశైలంలోకి తుంగభద్ర, భీమా నదుల నుండి ఇప్పుడిప్పుడే నీరు వచ్చే పరిస్థితి లేదని కృష్ణా నుండి రావాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. తుంగభద్ర డ్యామ్ పూర్తి స్థాయి సామర్థ్యం 105 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 82 టిఎంసిలకే పరిమితమైంది. తుంగభద్రలోకి 11,232 క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తోంది. ప్రస్తుతం తుంగభద్ర డ్యామ్‌కు వుండే పంటకాల్వలకు నీరు విడుదల చేయడంతో ఇపుడున్న ఇన్‌ఫ్లోస్‌తో తుంగభద్ర డ్యామ్‌ను దాటుకుని వరద కిందికి రావడం అనుమానమేనని అధికారులు చెబుతున్నారు. అలాగే భీమా నదిపై వున్న ఉజ్జయిని డ్యామ్ సామర్థ్యం 117 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 64.6 టిఎంసిలు మాత్రమే వున్నాయి. అలాగే అల్మట్టి డ్యామ్ పూర్తిసామర్థ్యం 129.7 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 115 టిఎంసిల నీరు వుంది. కీలకమైన ఆల్మట్టి డ్యామ్‌లోకి ప్రవాహం 15వేల క్యూసెక్కులకు పడిపోయింది. జూరాల ప్రాజెక్టు సామర్థ్యం 9.66 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 8.16 టిఎంసిలు వుంది. జూరాల సామర్థ్యం తక్కువ కావడంతో భీమా, కృష్ణానది నుండి వచ్చే వరదను వచ్చింది వచ్చినట్లుగా శ్రీశైలంలోకి వదులుతున్నారు. శ్రీశైలంలోకి వచ్చే వరద ప్రవాహం క్రమేణా తగ్గుతుండటం పట్ల నీటిపారుదలశాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. శ్రీశైలం తర్వాత మరో పెద్ద ప్రాజెక్టు అయిన నాగార్జున సాగర్‌లో ఆగస్ట్ నాటికి కూడా డెడ్‌స్టోరేజ్ మట్టానికి మించి నీరు చేరకపోవడం ఆందోళన కల్గించే అంశం. నాగార్జున సాగర్ సామర్థ్యం 312 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 142 టిఎంసిలు మాత్రమే వున్నాయి. ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ నుండి నాగార్జున సాగర్‌లోకి 12,804 క్యూసెక్కులు వస్తోంది. పులిచింతల రిజర్వాయర్ సామర్థ్యం 45.77 టిఎంసిలకు గాను 31.48 టిఎంసిలు ఉన్నాయి. కృష్ణా డెల్టాకు సాగునీరు అందించే ప్రకాశం బ్యారేజి వద్ద ప్రవాహం నిలిచిపోవడంతో పట్టిసీమ నుండి గోదావరి నీటిని వదులుతున్నారు. తెలుగుగంగకు సాగునీటిని అందించే వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సామర్థ్యం 16.95 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 1.67 టిఎంసిలు మాత్రమే వుంది. పెన్నా నదిపై వున్న సోమశిల ప్రాజెక్టు సామర్థ్యం 78 టిఎంసిలు కాగా, 24.25 టిఎంసిలు, కండలేరు రిజర్వాయర్ సామర్థ్యం 68 టిఎంసిలకు గాను 17.27 టిఎంసిలు మాత్రమే వున్నాయి. రాష్ట్రంలో సాగు నీటికి సంబంధించిన ప్రాజెక్టులలో గోదావరి డెల్టా మినహా మరే ప్రాజెక్టులోకి సాగునీటి అందించేలా వరద ప్రవాహం లేకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.
పోతిరెడ్డిపాడు నుంచి 12వేల క్యూసెక్కులు విడుదల
రాయలసీమ జిల్లాలోని తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బిసి, కెసి కెనాల్‌కు సాగునీటిని అందించేందుకు రాష్ట్ర జలవనరు ల శాఖ అధికారులు శుక్రవారం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యు లేటర్ నుంచి 12 వేల క్యూసెక్కులను దిగువకు వదిలారు. హంద్రీనీవా సుజలస్రవంతికి సాగునీటిని అందించేందుకు ఇప్పటిదాకా నీటివిడుదలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులురాలేదని జలవనరులశాఖ అధికారులు తెలిపారు.