- పెండింగ్ ప్రాజెక్టుల పూర్తిలో జగన్ విఫలం
- పులివెందుల సభలో చంద్రబాబు
ప్రజాశక్తి- కడప ప్రతినిధి/యంత్రాంగం : గోదావరి నీటిని రాయలసీమకు తరలిస్తామని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తిలో ముఖ్యమంత్రి జగన్ విఫలయ్యారని విమర్శించారు. రాష్టంలోని నాగార్జున సాగర్, పట్టిసీమల ద్వారా 280 టిఎంసిలను నిల్వ చేసుకునే అవకాశం ఉందని, వాటిని నల్లమలలో సొరంగం తవ్వి రాయలసీమకు తరలిస్తామని అన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని కొండాపురం మండల కేంద్రంలోని సిబిఆర్ లిఫ్ట్ స్కీమ్‌ను బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం మండలంలోని తిమ్మాపురంలో రైతులతో ముఖాముఖి, పులివెందుల నియోజకవర్గ కేంద్రంలో రోడ్ షో నిర్వహించి భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధం కార్యక్రమంలో భాగంగా ముందుగా తిమ్మాపురం రైతుల సమావేశంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్టంలోని సాగునీటి ప్రాజెక్టు పనుల్లో అధికం ముఖ్యమంత్రి తన మంత్రివర్గ సహచరులకే కట్టబెట్టారని విమర్శించారు. జిఎన్‌ఎస్‌ఎస్-హెచ్‌ఎన్‌ఎఎస్, గండికోట సొరంగం పనుల పేరుతో దోపిడీకీ స్కెచ్ వేశారని ఆరోపించారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయలేని సిఎం జగన్ కొత్త ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి తెరలేపారని దుయ్యబట్టారు. కొత్తగా పది ప్రాజెక్టులంటూ రూ.12 వేల కోట్ల దోపిడీకి సిద్ధమయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకుండా ఏడిపిస్తున్నారని, మంత్రి పెద్దిరెడ్డికి మాత్రం రూ.600 కోట్ల బిల్లులను సెటిల్ చేశారని అన్నారు. ఏ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఎవరికి పేరు వస్తుందోనని పెండింగ్ ప్రాజెక్టులను వదిలేశారని విమర్శించారు. ఉన్న ప్రాజెక్టులను రద్దు చేసి 23 ప్రాజెక్టులతో రాయలసీమ దుర్భిక్ష నివారణ పథకం పేరుతో జగన్ డ్రామాలాడుతున్నారన్నారు. నాలుగేళ్లలో ఒక్కటీ పూర్తి చేయలేదని విమర్శించారు. నెలకోసారి ఢిల్లీ వెళ్లే జగన్ ఈ ప్రాజెక్టులపై కెఆర్‌ఎంబి, ఎన్‌జిటి, సిడబ్ల్యుసి నుంచి ఎలాంటి అనుమతులూ తేలేకపోయారన్నారు. ఆగస్టు 2వ తేదీ వచ్చినా శ్రీశైలం మోటార్లు ఇంకా ఆన్ కాలేదన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ఆ నీటిని బనకచర్లకు తెచ్చి ఉంటే ఈ సమస్య ఉండేది కాదని తెలిపారు. పోలవరం నిర్వాసితులు వరద ముంపునకు గురైతే కనీసం తిండి కూడా పెట్టట్లేదని విమర్శించారు. పోలవరం ముంపు మండలాలను ప్రత్యేక జిల్లాగా ప్రకటిస్తామని, నిర్వాసితులను ఆదుకుంటామని అన్నారు. 'నేను ప్రాజెక్టుల గురించి మాట్లాడుతుంటే ఆ శాఖ మంత్రి 'బ్రో' సినిమా గురించి మాట్లాడుతున్నారు' అని విమర్శించారు. వివేకా కూతురు ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా హత్య కేసులో పోరాడుతున్నారని అన్నారు. కడప ఎంపి అవినాష్ నంగనాచిలా మాట్లాడుతున్నాడని విమర్శించారు.
- పులివెందులలో ఉద్రిక్తత
చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పులివెందులలోని పూలంగళ్లుసర్కిల్ వద్దకు భారీ సంఖ్యలో టిడిపి శ్రేణులు తరలివచ్చాయి అక్కడ అలజడి సృష్టించేందుకు వైసిపి శ్రేణులు యత్నించాయి. వైసిపి జెండాలు పట్టుకుని కారులో వచ్చిన ముగ్గురు కార్యకర్తలు 'జై జగన్' అంటూ నినాదాలు చేస్తూ టిడిపి శ్రేణులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో, ఉద్రిక్తత నెలకొంది. ఆగ్రహానికి గురైన టిడిపి కార్యకర్తలు వెంటపడి తరమడంతో అక్కడి నుంచి వైసిపి కార్యకర్తలు వాహనంలో పరారయ్యారు. పరిస్థితిని అదుపు చేసే పేరుతో పోలీసులు టిడిపి కార్యకర్తలపై లాఠీఛార్జి చేశారు.