Jun 07,2023 22:01

ముందస్తు పంటల సాగుకు రైతులు సిద్ధం కండి
శరవేగంగా పోలవరం ప్రాజెక్టు పనులు : మంత్రి అంబటి

ప్రజాశక్తి- విజయవాడ:ప్రకాశం బ్యారేజి నుంచి కృష్ణా ఈస్ట్రన్‌ హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌కు సాగునీటిని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా డెల్టా పరిధిలోని రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఖరీఫ్‌ సీజన్లో నెల రోజులు ముందుగానే 13 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తున్నామన్నారు. గత సంవత్సరం జూన్‌ పదిన నీటిని విడుదల చేశామని, ఈ ఏడాది మూడు రోజులు ముందుగానే సాగునీరు విడుదల చేశామని వివరించారు. దీనివల్ల ఈ ఏడాది రైతులు మూడు పంటలు పండించుకునేందుకు, తుపానులు వంటి ప్రకఅతి వైపరీత్యాల బారిన పంటలు పడకుండా ఉంటేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. పులిచింతల ప్రాజెక్టులో 34 టిఎంసిల నీటి నిల్వ ఉందని తెలిపారు. నీరు సమృద్ధిగా ఉండడంతో పట్టిసీమ నుండి నీటిని తీసుకొచ్చే అవసరం లేదన్నారు. నాగార్జునసాగర్‌ నుండి కూడా నీరు విడుదల అయ్యే అవకాశం ఉందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు తొలి దశలో అవసరమయ్యే రూ.12,911.15 కోట్లను ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించడం శుభ పరిణామమన్నారు. ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, తమ ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. కృష్ణా నదికి వచ్చే వరద నుండి విజయవాడ నగరవాసులకు రక్షణగా చేపట్టిన రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం మూడో దశ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ మాట్లాడుతూ గత నాలుగేళ్లగా వర్షాలు పుష్కలంగా కురిసి ప్రాజెక్టులలో నీరు సమఅద్ధిగా ఉండి జలకళను సంతరించుకున్నాయన్నారు. దీనివల్ల రైతులకు మేలు చేకూరిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ఎస్‌.ఢిల్లీరావు, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణువర్ధన్‌, దూలం నాగేశ్వరరావు, జనవనరుల శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ సి. నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.