Oct 21,2023 10:26
  • తొలి వికెట్‌కు రికార్డు భాగస్వామ్యం
  • జంపా మ్యాజిక్‌ బౌలింగ్‌
  • పాక్‌పై 62పరుగుల తేడాతో ఆసీస్‌ గెలుపు
  • షాహిన్‌ అఫ్రిదికి ఐదు వికెట్లు

బెంగళూరు : ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకొని టాప్‌-4కు చేరుకుంది. చిన్నస్వామి స్టేడియంలో పాకిస్తాన్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 62పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 367పరుగుల భారీస్కోర్‌ చేయగా.. ఛేదనలో పాకిస్తాన్‌ 45.3ఓవర్లలో 305పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో పాక్‌ జట్టు ఓ దశలో 3వికెట్ల నష్టానికి 232పరుగులు చేసి పటిష్టంగా ఉన్నా.. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి పరాజయాన్ని చవిచూసింది. పాక్‌ జట్టు ఓపెనర్లు అబ్దుల్లా(64), ఇమామ్‌(70) తొలి వికెట్‌కు 134పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. ఆ తర్వాత కెప్టెన్‌ బాబర్‌(18) నిరాశపరిచినా.. షౌద్‌ షకీల్‌(30) ఫర్వాలేదనిపించాడు. పాక్‌ జట్టు విజయానికి చేరువ అవుతున్న దశలో ఆడం జంపా ఒకే ఓవర్లో రిజ్వాన్‌(46), ఇప్తికార్‌(26)లను ఔట్‌ చేసి మ్యాచ్‌ను ఆసీస్‌వైపు తిప్పాడు. జంపాకు నాలుగు, స్టొయినీస్‌, కమిన్స్‌కు రెండేసి వికెట్లు దక్కాయి.
          అంతకుముందు టాస్‌ ఓడి తొలి గా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు ఓపె నర్లు వార్నర్‌(163), మిఛెల్‌ మార్ష్‌ (121) తొలి వికెట్‌కు 259పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. వీరిద్దరి నిష్క్రమణ తర్వాత ఆసీస్‌ జట్టు వరుసగా వికెట్లను కోల్పోయింది. షాహిన్‌ అఫ్రిదికి ఐదు, రవూఫ్‌కు మూడు వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ డేవిడ్‌ వార్నర్‌కు లభించింది.
 

                                                                      ఆసీస్‌ రికార్డు భాగస్వామ్యం..

వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌(163), మిచెల్‌ మార్ష్‌(121) రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సెంచరీలతో కదం తొక్కిన వీరు తొలి వికెట్‌కు వీరిద్దరూ ఏకంగా 259 పరుగుల జతచేశారు. దీంతో వన్డే వరల్డ్‌కప్‌లో ఆసీస్‌ తరఫున తొలి వికెట్‌కు రికార్డు భాగస్వామ్యం నమోదైంది. అలాగే ఆసీస్‌ ఓపెనర్లు ఇద్దరూ వన్డే ప్రపంచకప్‌లో సెంచరీ చేయడం కూడా ఇదే తొలిసారి. ఓవరాల్‌గా వన్డే ప్రపంచకప్‌లో తొలి వికెట్‌కు 200కు పైగా పరుగులు జతచేసి వీరు ఆరో స్థానంలో నిలిచారు. ఇక ఆసీస్‌ తరఫున వన్డే ప్రపంచకప్‌లలో భారీ భాగసామ్యాన్ని నెలకొల్పిన మూడు సందర్భాల్లోనూ వార్నర్‌ ఉన్నాడు. వార్నర్‌ అంతకుముందు 178, 166, 163తో అరుదైన ఘనత దక్కించుకున్నాడు.
 

 వన్డే ప్రపంచకప్‌లో నేడు..
నెదర్లాండ్స్‌ × శ్రీలంక
(వేదిక: లక్నో; ఉ.10.30గం||లకు)
ఇంగ్లండ్‌ × దక్షిణాఫ్రికా
(వేదిక: ముంబయి; మ.2.00గం||లకు)

012022