Feb 19,2023 11:25
  • పేరుకుపోయిన 12 లక్షల టన్నులు
  • రైతుల వద్ద ఇంకా 40 లక్షల టన్నులు
  • మిగిలిన టార్గెట్‌ 5 లక్షల టన్నులే

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : ధాన్యం కొనుగోళ్లను గోదాముల సమస్య కుంగదీస్తోంది. సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలించాల్సి ఉండగా, దాదాపు 12 లక్షల టన్నుల ధాన్యం నిల్వలు గోదాముల్లో పేరుకుపోయినట్లు సమాచారం. వాటిని తరలిస్తేగాని కొత్తగా ధాన్యం సేకరణ సాధ్యం కాదని పౌరసరఫరాల, వ్యవసాయ, సంబంధిత ఇతర ప్రభుత్వ విభాగాలు వెల్లడించాయి. తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో రైతులు ఆందోళన బాట పట్టగా, గిడ్డంగులు ఖాళీ లేక కనీసం టార్గెట్‌కనుగుణంగానైనా ధాన్యం సేకరణ జరగట్లేదని చెబుతున్నారు. ధాన్యం సేకరణ పాలసీలో ప్రభుత్వ విభాగాలు ధాన్యం తరలింపుపై (మూవ్‌మెంట్‌) ముందస్తుగా పెద్ద ప్రణాళికనే రచించాయి. ఏ రోజు ఎక్కడికి ఏ అధికారి పర్యవేక్షించాలో తెలిపారు. ఆ ప్లాన్‌ ప్రకారం తరలించకపోవడం ప్రభుత్వ వైఫల్యంగా ఆరోపణలొస్తున్నాయి. రైతులు పంట అమ్ముకోలేక నష్టపోతున్నారు.
 

                                                                   ఇంకా 5 లక్షల టన్నులు

ఖరీఫ్‌లో 77 లక్షల టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి జరుగుతుందని అర్థగణాంక శాఖ తన రెండవ ముందస్తు అంచనాలో పేర్కొంది. ప్రభుత్వం మాత్రం 37 లక్షల టన్నులే సేకరిస్తామంది. నిరుటి కంటే 3 లక్షల టన్నుల మేర లక్ష్యాన్ని తగ్గించింది. నిర్ణయించిన లక్ష్యంలో ఇప్పటి వరకు అతికష్టం మీద 32 లక్షల టన్నులు సేకరించారు. ఇంకా 5 లక్షల టన్నులు సేకరించాలి. మరోవైపు ఈ తడవ ఖరీఫ్‌ సాగు ఆలస్యం కావడంతో జనవరి, ఫిబ్రవరిలో కోతలు సాగి వడ్లు రైతుల చేతికొస్తున్నాయి. సరిగ్గా ఈ సమయంలో చాలా చోట్ల ఆర్‌బికెలలో కొనుగోలు కేంద్రాలు మూసేశారు. టార్గెట్‌లు పూర్తయ్యాయంటున్నారు. రైతులేమో పంట ఎక్కడ అమ్ముకోవాలో తెలీక నానా అవస్తలూ పడుతున్నారు.

                                                                   40 లక్షల టన్నుల పరిస్థితేంటి ?

ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్ణయించిన టార్గెట్‌ను చేరినా ఇంకా 40 లక్షల టన్నుల ధాన్యం రైతుల వద్ద ఉంటుందని అంచనా. రైతుల సొంత వినియోగానికి 20 లక్షల టన్నులు మినహాయించినా, ఇంకా 20 లక్షల టన్నులు నికరంగా రైతుల వద్ద ఉంటుంది. ప్రభుత్వం టార్గెట్‌ మేరకేనని భీష్మిస్తే, రైతులు దక్కినకాడికి ప్రైవేటు వ్యాపారులకు, దళారులకు అమ్ముకోవాల్సిన అనివార్య పరిస్థితి. ఇప్పటికే సేకరించామంటున్న ధాన్యంలో సగానికి కూడా రైతులకు మద్దతు ధర దక్కలేదని అంచనా. మిల్లర్లు, వ్యాపారులు రైతుల నుంచి సాగు రికార్డులు తీసుకొని తృణమోపణమో చేతిలో పెట్టారు. మరోవైపు ప్రభుత్వం ధాన్యం డబ్బులు ఆలస్యంగా రైతుల ఖాతాల్లో వేస్తోంది. ధాన్యం ఇచ్చాక 40-50 రోజులకు కూడా రొక్కం పడట్లేదు. కౌలు రైతులకు ఇది కూడా లేదు.