Nov 07,2023 09:55
  • నాలుగేళ్లలో 11 లక్షల టన్నుల క్షీణత

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ప్రభుత్వం చెబుతున్న మాటలు ఎలా ఉన్నప్పటికీ ఖరీఫ్‌లో ధాన్యం సేకరణ ఏడాదికేడాదికి తగ్గుతోంది. ప్రతి ఏడాది సీజన్‌ ప్రారంభంలో చెబుతున్న లక్ష్యాల కు ఆచరణకు పొంతన లేని పరిస్థితి ఏర్పడు తోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే గత నాలుగు సంవత్సరాల్లో రైతుల నుండి ధాన్యం సేకరణ 11 లక్షల టన్నుల మేర తగ్గింది. 2019-20వ సంవత్సరంలో 47.83 లక్షల టన్నుల గా ఉన్న ధాన్యం సేకరణ , 2022 -23 సంవత్సరానికి 35.36 లక్షల టన్నులకు పరిమితమైంది. ఈ నేపధ్యంలో ఈ ఏడాది ప్రభు త్వం చెబుతున్న లక్ష్యాలు నెరవేరడంపై కూడా అను మానాలు వ్యక్తమవుతున్నాయి. 2023-24వ సంవ త్సరం ఖరీఫ్‌లో రాష్ట్రంలో 13లక్షల హెక్టార్లలో వరి సాగు అయిందని, 79 లక్షల టన్నులకు పైగా ధాన్యం ఉత్పత్తయిందని, దానిలో 37 లక్షల టన్నుల ధాన్యా న్ని సేకరించడం లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. అయితే, వరుసగా గత సంవత్సరాల అనుభవాలను పరిశీలిస్తున్న నిపుణులు ఈ లక్ష్య సాధనపై అనుమా నాలు వ్యక్తం చేస్తున్నారు. గత మూడు సంవత్సరా ల్లో రెండు మూడు జిల్లాల్లో మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ అంతకు ముందు ఏడాదితో పోలిస్తే తక్కువగానే ధాన్యం సేకరించడం దీనికి కారణం.
 

                                                                          ఈ ఏడాది ప్రారంభం

ఈ ఏడాది ధాన్యం సేకరణ రాష్ట్రంలో ప్రారంభమైంది. నవంబరు మొదటి వారంలో తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల్లో పంట నూర్పిళ్లు ప్రారంభం కావడంతో ఆయా జిల్లాల్లో ధాన్యం కొనుగోలును ప్రభుత్వం ప్రారంభించింది. సోమవారం మధ్యా హ్నం 1గంట వరకు రూ.3.45కోట్ల విలువ జేసే 1,581 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగో లు చేసింది. ఇందులో తూర్పుగోదావరి జిల్లాలో 1413 మెట్రిక్‌ టన్నులు, కాకినాడ జిల్లాలో 5మెట్రిక్‌ టన్నులు, కోనసీమ జిల్లాలో 11 మెట్రిక్‌ టన్నులను ఆదివారం సాయంత్రం వరకు కొనుగోలు చేశారు. ఎఫ్‌సిఐకి, చౌక ధరల దుకాణా లకు సరిపడా సేకరించాల్సిన ధాన్యం 25లక్షల మెట్రిక్‌ టన్నులుగా పౌరసరఫరాలశాఖ పేర్కొంది. దానికి అదనంగా ఎంత సేకరిస్తుందన్నది చర్చనీయాంశంగామారింది. రాష్ట్రంలోని 3,600 రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
 

                                                         సరిపడా నిధులివ్వాలి : కౌలు రైతు సంఘం

సేకరించిన ధాన్యానికి వెంటనే డబ్బు చెల్లించేందుకు అవసరమైన నిధులను సివిల్‌ సప్ల్తె, మార్కెటింగ్‌ శాఖల వద్ద అందుబాటులో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. గత ఏడాది పది వేల కోట్లకు పైగా విలువజేసే ధాన్యం కొనుగోలు చేశారని, ప్రభుత్వం వద్ద తగినంత నిధులు లేక పోవడంతో మిల్లర్లు బ్యాంక్‌ గ్యారెంటీలు అవసరమైనంత నిల్వ ఉంచడం లేదని పేర్కొన్నారు. ధాన్యం తోలిన వంద రోజులకు కూడా రైతులు, కౌలు రైతుల బ్యాంక్‌ అకౌంట్లలో జమ కాలేదనిఆ సంఘం పేర్కొంది. అంతే కాకుండా సంచులు, కాటా కూలి, రవాణా చార్జీలు ఉచితమని చెప్పినప్పటికీ సంచులు, హమాలీ కూలీ, రవాణా చార్జీలు నేటికి అందని రైతులు కూడా ఉన్నారని పేర్కొన్నారు.. ప్రభుత్వం ధాన్యం తోలిన వెంటనే డబ్బులు చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.రాధాకృష్ణ, ఎమ్‌. హరిబాబు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

table