May 06,2023 10:15
  • తుపాను హెచ్చరికలతో రైతుల్లో ఆందోళన
  • కన్నీటి సంద్రంలో అన్నదాత
  • సంచుల్లేక కల్లాల్లోనే ధాన్యం

ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి : 'నా పేరు సంపతి వెంకటేశ్వకరావు. మాది కైకరం గ్రామం. 11 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగుచేశాను. గతనెల 22న మాసూలు పూర్తిచేశాను. కానీ ఇప్పటి వరకూ సంచులు ఇవ్వలేదు. వర్షాలకు ధాన్యం తడిసి మొలకలు వస్తున్నాయి. రైతులకు రాజకీయాలు ఆపాదించి సంచులు ఇవ్వకుండా చేస్తున్నారు. ధాన్యాన్ని ఏ విధంగా గటెక్కించాలో తెలీయడం లేదు.'
      'నా పేరు సానం ఏడుకొండలు. మాది కైకరం. పదెకరాలు కౌలుకు తీసుకుని వరి సాగుచేశాను. గతనెల 18న మాసూలు చేశాను. ఇంకా 500 సంచుల్లేక అలానే ఉండిపోయాయి. వర్షాలకు తడిసి ధాన్యం మొలకలు వస్తున్నాయి. ధాన్యం కాపాడుకునేందుకు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఎప్పటికి ధాన్యం వెళ్తుందో తెలియడం లేదు.'
       పైన పేర్కొన్న సమస్యలను ఎదుక్కొంటున్నది వెంకటేశ్వరరావు, ఏడుకొండలు మాత్రమే కాదు.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లో వరిసాగుచేసిన వేలాది మంది రైతులది ఇదే పరిస్థితి. మాసూలు చేసిన కల్లాలో ఉన్న ధాన్యం అమ్ముకునేందుకు సంచుల్లేక, లారీలు లేక నానా అవస్థలు పడుతున్నారు. మాసూలు చేసి 20 రోజులు గడస్తున్నా ఇప్పటికీ సంచులు ఇవ్వని పరిస్థితి కొనసాగుతోంది. ధాన్యం కొనుగోలులో నూతన విధానం అస్తవ్యస్తంగా తయారైంది. సంచులు, లారీల విషయంలో అధికారులు పూర్తిగా చేతులెత్తేశార. దీంతో రైతులు గందరగోళానికి గురవుతున్నారు. బంగాళాఖాతంలో పొంచి ఉన్న తుపాను హెచ్చరికలతో రైతులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఈ నెల తొమ్మిదో తేదీకి అల్పపీడనం తుపానుగా మారనున్నట్లు చేస్తున్న హెచ్చరికలు రైతులకు కంటిమీద కునుకులేకుండా చే స్తున్నాయి. ఏలూరు జిల్లాలో 79వేల ఎకరాలు, పశ్చిమలో 2.13లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగుచేశారు. ఏలూరు జిల్లాలో 3.90 లక్షల మెట్రిక్‌ టన్నులు, పశ్చిమలో 9.28 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. రెండురోజుల క్రితం అధికారులు విడుదల చేసిన లెక్కల ప్రకారం చూస్తే ఇప్పటి వరకూ పశ్చిమలో 2.30 లక్షల మెట్రిక్‌ టన్నులు, ఏలూరులో 1.15 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. అంటే రెండు జిల్లాల్లో కలిపి 3.50 లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. అధికారుల లెక్కల ప్రకారం చూస్తే ఇంకా దాదాపు ఎనిమిది లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. దాదాపు 50 శాతంపైగా ధాన్యం కల్లాల్లోనే ఉండిపోయింది. లారీలు, సంచులు అందిచడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మంత్రులు, ఎంఎల్‌ఎలు రైతుల వంక కనీసం చూడటం లేదు. రైతులకు రాజకీయాలు ఆపాదించి సంచులు ఇవ్వడం లేదంటూ పలువురు రైతులు గగ్గోలు పెడుతున్నారు. రైతులకు రాజకీయాలు ఆపాదించడం ఏమిటో కూడా అర్ధంకావడంక లేదు.
 

                                                        ఆరబెట్టకపోతే మొలకలు.. ఆరబెడితే వర్షం

వారంరోజులగా వర్షం రైతులను వెంటాడుతోంది. ప్రతీరోజు ఏదో ఒక సమయంలో వర్షం పడుతూనే ఉంది. దీంతో రైతుల పరిస్థితి దారుణంగా మారింది. వర్షాలకు తడిసిన ధాన్యం అరబెట్టకపోతే మొలకలు వస్తున్నాయి. ఆరబెడితే వర్షానికి మళ్లీ తడిసిపోతుంది. ఆరబెట్టిన తర్వాత వర్షం వస్తే ధాన్యం మళ్లీ రాశులుగా చేయడం చాలా కష్టం. దీంతో రైతులకు ఏంచేయాలో అర్ధంకాక తలలు పట్టుకుంటున్నారు. ఉంగుటూరు మండలం నాచుగుంట, కైకరం వంటి గ్రామాల్లో ఇప్పటికే తడిసిన ధాన్యం మొలకలు రావడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.
       రవాణాకు లారీలు రావడం లేదని, సంచులు ఇవ్వడం లేదని రైతులు మొత్తుకుంటున్నా ఏ ఒక్కరికీ పట్టడం లేదు. గతనెల 16వ తేదీన ధాన్యం కొనుగోలు ప్రారంభించారు. 20 రోజులు దాటుతున్నప్పటికీ సమస్యలు పరిష్కారంకాలేదు. మిల్లర్లు పెడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీకావు. ముక్క పేరుతో పెద్దఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారు. ఖరీఫ్‌లో తేమపేరుతో రైతుల నుంచి దోచేసిన మిల్లర్లు, రబీలో ముక్క పేరుతో దోపిడీ చేస్తున్నారు. మిల్లర్లను ప్రభుత్వం అదుపుచేయలేని పరిస్థితి నెలకొంది. ఈనెల మొదటివారం గడిచిపోతున్నా ఇంకా కల్లాల్లోనే ధాన్యం ఉండిపోవడంతో, వర్షాలతో పంట గట్టెక్కేదెలా అంటూ అన్నదాతలు మదనపడుతున్నారు.