May 08,2023 08:32
  • తీరు మారకపోతే మిల్లర్లపై చర్యలు
  • శ్రీ ధాన్యం కొనుగోళ్లు జిల్లా పర్యవేక్షణాధికారి శశిభూషణ్‌కుమార్‌

ప్రజాశక్తి - ఉంగుటూరు (ఏలూరు జిల్లా) : నూక శాతం పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దని, ధాన్యం సేకరణలో రైతులను ఇబ్బంది పెట్టే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర జలవనరుల శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి, ధాన్యం కొనుగోళ్లు జిల్లా పర్యవేక్షణాధికారి శశిభూషణ్‌కుమార్‌ హెచ్చరించారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు ఆర్‌బికె, నాచుగుంట రైస్‌మిల్లులను ఆదివారం ఆయన సందర్శించారు. రైతులు, ఆర్‌బికె సిబ్బందితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ధాన్యం తేమ, నూకల శాతం కొలిచిన తరువాత ధాన్యాన్ని రైసుమిల్లుకు తరలించాక మిల్లర్లు తమకు పలుమార్లు ఫోన్‌ చేసి ధాన్యం కొనుగోలు విషయంలో పలు ఇబ్బందులు పెడుతున్నారన్నారు. రవాణాలో లారీ డ్రైవర్లు అధిక మొత్తం డిమాండ్‌ చేస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై శశిభూషణ్‌కుమార్‌ స్పందిస్తూ ధాన్యం రవాణాకు ట్రక్‌ షీట్‌ రూపొందించాక ధాన్యాన్ని రైస్‌మిల్లుకు పంపి దిగుమతి చేయించాల్సిన బాధ్యత కస్టోడియన్‌ అధికారిదని, దీనిలో రైతులకు ఎటువంటి ప్రమేయమూ ఉండదని స్పష్టం చేశారు. ఆర్‌బికె అధికారులకు ధాన్యం అందించాక సొమ్ము 10 రోజుల్లో రైతుల ఖాతాల్లో జమవుతుందన్నారు. అధికారులు సమన్వయంతో పని చేస్తే ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎటువంటి ఇబ్బందులూ ఉండవన్నారు. రవాణా ఛార్జీలను జిల్లాస్థాయిలో లారీ యజమానులతో చర్చించి నిర్ణయించారని, లారీ డ్రైవర్లకు కూడా అధిక మొత్తం చెల్లించనవసరం లేదని, ఏ లారీ డ్రైవర్‌ అయినా ఇబ్బంది పెడితే వెంటనే దగ్గరలోని అధికారులకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. కొన్ని కేంద్రాల్లో ధాన్యం సేకరణ లక్ష్యం పూర్తయినప్పటికీ మళ్లీ లక్ష్యాన్ని సవరించి ధాన్యం సేకరణ చేస్తున్నామన్నారు. తడిచి రంగుమారిన ధాన్యంను కూడా రైతుల నుండి కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో ఇప్పటి వరకూ రూ.240 కోట్ల విలువైన ధాన్యాన్ని రైతుల నుండి సేకరించామన్నారు. నాచుగుంట గాయత్రి ట్రేడర్స్‌ రైస్‌మిల్లులో నూక శాతం విధానంపై సమీక్షించారు. ఆయన వెంట జాయింట్‌ కలెక్టర్‌ బి.లావణ్యవేణి, వ్యవసాయ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ వై.రామకృష్ణ, డిప్యూటీ తహశీల్దార్‌ పోతురాజు, మండల వ్యవసాయాధికారి రామకృష్ణ, జిల్లా అధికారులు ఉన్నారు.