
- ధాన్యాన్ని కాపాడుకునేందుకు నానావస్థలు
- వర్షానికి రంగుమారడం, మొలకెత్తడంతో ఆందోళన
- నింబంధనల పేరుతో కొనుగోలులో ప్రభుత్వం జాప్యం
ప్రజాశక్తి- ఏలూరు, రాజమహేంద్రవరం ప్రతినిధులు : అకాల వర్షాలు, ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో వరి రైతులు నిండా మునిగారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం, అవసరమైన మేరకు గోనె సంచులు సరఫరా చేయకపోవడం, రైస్ మిల్లర్లు రవాణా వాహనాలను పంపించకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతూ వచ్చారు. రోజుల తరబడి రైతుల వద్ద ధాన్యం నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో అకాల వర్షాలకు ధాన్యం తడిచిపోయి మొలకలు రావడం, రంగు మారడంతో చెంపదెబ్బకుతోడు గోడదెబ్బ కూడా తగిలినట్లయింది. ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిబంధనల పేరుతో రైతులను ఇబ్బందుకు గురి చేస్తోంది.
రబీలో ఏలూరు జిల్లాలో 79 వేల ఎకరాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 2.13 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 9.28 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. 6.47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఏలూరు జిల్లాలో 3.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఏప్రిల్ 16వ తేదీ వరకూ ధాన్యం కొనుగోలు ప్రారంభించకుండా ఆలస్యం చేశారు. ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం పశ్చిమగోదావరి జిల్లాలో మూడు లక్షల మెట్రిక్ టన్నులు, ఏలూరు జిల్లాలో లక్షా 40 వేల టన్నుల ధాన్యం మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసింది. అంటే ఈ రెండు జిల్లాల్లో మొత్తం 13.10 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడికిగానూ ఇప్పటి వరకూ కొనుగోలు చేసింది 4.40 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. రైతు కొనుగోలు కేంద్రాలతో సంబంధం లేకుండా విక్రయించిన ధాన్యం మరో రెండు లక్షల మెట్రిక్ టన్నుల వరకూ ఉండొచ్చని అంచనా. ఆ లెక్కన ఇంకా 6.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల వద్దే ఉంది.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 4.50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. సుమారు 16 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. కాకినాడ, రాజమహేంద్రవరం, డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో ప్రస్తుతం 60 శాతం కోతలు పూర్తయ్యాయి. 7.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. ప్రభుత్వం కేవలం మూడు లక్షలు మెట్రిక్ టన్నులే కొనుగోలు చేసింది. మిగిలిన 4.50 లక్షల టన్నుల్లో 1.50 లక్షల టన్నులు ప్రయివేట్ వ్యాపారులు కొనుగోలు చేసినట్లు అంచనా. మిగతా ధాన్యం రైతుల కళ్లాల్లో, ఆరుబయట ఉంది. ఈ నేపథ్యంలో పడిన అకాల వర్షాలకు ధాన్యం తడిచిపోయాయి. ఇప్పుడు దీని కొనుగోలుకు అధికారులు నిబంధనల పేరుతో జాప్యం చేస్తున్నారు. మొలక వచ్చిందని, రంగు మారిందని, తేమ శాతం అధికంగా ఉందని చెప్తుండడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కళ్లాల్లోనూ, ఆరుబయట ఉన్న ధాన్యాన్ని రక్షించుకోవడానికి ఒక్కో బరకాకు రోజుకు రూ.25 చొప్పున అద్దె చెల్లించాల్సి వస్తోంది. గోనె సంచులు ఇస్తే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తామని రైతులు అంటున్నా అధికారుల్లో స్పందన లేదు. తేమ శాతం, నూక, తాలు పేరిట మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ క్వింటాలుకు రూ.150 నుంచి రూ.300 చొప్పున వసూలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కోతం సిద్ధంగా ఉన్న వరి చేలలో 40 శాతం ఒరిగిపోవడం, తడిచిపోవడంతో దిగుబడి తగ్గిపోయే, ధాన్యం రంగు మారే ప్రమాదం ఉందని వాపోతున్నారు. మొలకెత్తిన, రంగుమారిన ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులూ రాకపోవడంతో ఆందోళనతో ఉన్నారు. నిబంధనలు సడలించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, మద్దతు ధర కల్పించాలని కోరుతున్నారు.