
స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్ల తరువాత మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి తామే పచ్చ జెండా ఊపామని గప్పాలు పలుకుతున్నారు పాలకులు. ప్రభుత్వమేదైనా, పాలకులెవరైనా దేశంలో మహిళలు, ముఖ్యంగా అత్యాచార బాధితులకు ఈ సమంతైనా న్యాయం జరగడం లేదన్నది అక్షర సత్యం. నిందితులకు శిక్ష పడడం కోసం దశాబ్దాల తరబడి వేచిచూస్తున్న ఎందరో బాధిత మహిళల్లో 70 ఏళ్ల బామ్మలు కూడా ఉంటున్నారంటే ఎంత సిగ్గుచేటు? నిందితులందరూ మరణించి కనీసం బతికున్న ఒక్కడికైనా శిక్ష పడుతుందా అని ఎదురుచూస్తున్న ఓ బామ్మ పోరాట గాథ ఇది.
భన్వారీ లాల్‌కు ఇప్పుడు 70 ఏళ్లు. రాజస్థాన్ వాసి. 30 ఏళ్ల క్రితం తనపై జరిగిన అకృత్యంపై పోరాడి పోరాడి అలసిపోయింది. ఘోరం జరిగిన నాటి నుండి ఇప్పటి వరకు ఎన్నో అవమానాలు, అవహేళనలు ఎదుర్కొంది. ఎంతో ధైర్యంగా పోరాడిన ఆమెకు న్యాయం దొరక్కపోవడంతో ఇప్పుడు చాలా దిగాలు పడిపోతోంది. పెచ్చులూడిపోతున్న మట్టి ఇంట్లో... నులక మంచంపై దీనంగా కూర్చోన్న ఆమె, ప్రస్తుతం దేశంలో మహిళలపై జరుగుతున్న దారుణాలు చూస్తుంటే మనసు తరుక్కుపోతోంది అంటోంది. 'నాకు న్యాయం జరుగుతుందని ఎంతో ఎదురుచూశాను. కానీ, నేరం చేసిన వాళ్లు అప్పుడూ, ఇప్పుడూ స్వేచ్ఛగా తిరుగుతున్నారు. బాధితులమైన మేము మాత్రం నానా అవస్థలు పడుతున్నాం' అని ఆవేదన చెందుతోంది. 'ఈ దేశం ఆడపిల్లలకు న్యాయం చేయడంలో ఎప్పుడూ వెనుకడుగు వేస్తూనే ఉంది' అంటూ గద్గద స్వరంతో తనకేం జరిగిందో చెప్పడం ప్రారంభించింది.
ఆమె కథ ఇలా మొదలైంది !
బాల్య వివాహానికి గురైన భన్వారీ తన రాష్ట్రంలో బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేసే బృహత్తర కార్యక్రమంలో భాగమైంది. 'సాథీ'గా పిలవబడుతూ తన చుట్టూ జరుగుతున్న ఎన్నో బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేసింది. ప్రజలను చైతన్యపరిచేందుకు ఇంటింటికీ తిరిగేది. అయితే ఆమె జీవితాన్ని తలకిందులు చేసిన ఘటన ఓ రోజు జరిగింది. 'ఆ రోజు మా ఇంటిపక్కనే ఉంటున్న కుటుంబంలో 9 నెలల పసిబిడ్డకు ఓ ఏడాది వయసున్న పిల్లాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారని తెలిసి తల్లడిల్లిపోయాను. ఎలాగైనా ఆ వివాహాన్ని ఆపాలని ఎంతో ప్రయత్నించాను. అయినా ఆపలేకపోయాను' అంటూ ఆ రోజు జరిగిన సంఘటన గుర్తు చేసుకుంది.
పెళ్లి ఆపే ప్రయత్నం చేసినందుకు ఆ ఇంటి పెద్దలు కన్నెర్ర చేశారు. 1992 సెప్టెంబరు.. పశువులకు గడ్డి కోసేందుకు భన్వారీ, ఆమె భర్త పొలానికి వెళ్లారు. అప్పుడు ఊరిపెద్ద, ఆ ఇంటి పెద్ద, అతని మేనల్లుడు, బావమరుదులు ఆమెపై దాడికి తెగబడ్డారు. మొదట ఆమె భర్తపై దాడి చేశారు. తరువాత ఆమెపై విరుచుకుపడ్డారు. 'అప్పుడు నేను నీలం రంగు లెహంగా కట్టుకున్నాను. నా దుప్పట్టాతో నోరు నొక్కేసి, నా కాళ్లు చేతులు గట్టిగా పట్టుకుని ఒక్కొక్కరిగా నాపై లైంగిక దాడి చేశారు. వెళ్లిపోతూ నా చెవిదిద్దులు, మెడలో గొలుసు తెంచుకుని పోయారు. చెవుల వెంట రక్తం ధారలా కారింది. మెడపై గాయాలయ్యాయి. ఈ అన్యాయంపై ఫిర్యాదు చేయాలని, 10 కిలోమీటర్ల దూరంలోని పోలీసుస్టేషనుకు వెళ్లాను.'
కేసు నమోదు నుంచి కోర్టు విచారణ
వైద్య పరీక్షలు చేసిన తరువాతే కేసు తీసుకుంటామని పోలీసులు అన్నారు. అయితే అక్కడ మహిళా వైద్యురాలు లేకపోవడంతో ఆ రాత్రి ఆమెను జయపూర్‌కు తరలించారు. అప్పటికే బాగా పొద్దుపోయింది. మెజిస్ట్రేట్ ఉత్తర్వులు లేవని ఆ రోజు పరీక్షలు నిర్వహించలేదు. భన్వారీ, ఆమె భర్త రాత్రంతా పోలీసుస్టేషనులోనే గడిపారు. ఇంటి దగ్గర పిల్లలు గుర్తుకొచ్చి ఆమెకు ఒక్కసారిగా దు:ఖం కట్టలు తెంచుకుంది. అప్పటికే భన్వారీ పెద్ద కూతురికి పెళ్లయ్యింది. 'సాథీ'గా మారిన తరువాత చిన్న కూతురుకు పెళ్లి చేయకుండా ఉన్నత చదువులు చదివించాలని కలలు కంటోంది. మగపిల్లలిద్దరూ ఇంకా స్కూలుకు వెళ్లడం లేదు.
'పరీక్షల కోసం నా నీలం రంగు లెహంగా ఇవ్వమన్నారు. అది తప్ప నా దగ్గర మరో వస్త్రం లేదు. దీంతో రక్తంతో తడిసిన నా భర్త పంచెను నడుం చుట్టూ చుట్టుకుని లెహంగా వారికిచ్చేశాను. అయితే పోలీసులు నా మెడ, చెవిపై ఉన్న గాయాలను, చిరిగిపోయిన నా జాకెట్టును పరిగణనలోకి తీసుకోకుండానే ఎఫ్‌ఐఆర్ నమోదుచేశారు' అని ఆమె చెప్పింది.

ఆ కేసు ఓ సంచలనం
ఈ కేసు గురించి అప్పట్లో మీడియాలో పెద్దఎత్తున వార్తా కథనాలు వచ్చాయి. చాలాకాలం వరకు పోలీసులు నిందితులను అరెస్టు చేయలేదు. దేశవ్యాప్తంగా పెద్దఎత్తున మహిళా సంఘాలు ఆందోళనలు చేశాయి. ఓ మారుమూల గ్రామం నుంచి నిరక్షరాస్య మహిళా చేస్తున్న పోరాటానికి అండగా అనేకమంది ముందుకువచ్చారు. ఆమె చెబుతున్నది నిజమేనని జాతీయ మహిళా కమిషన్ కూడా నిర్ధారణ చేసింది. భన్వారీ ధీరత్వాన్ని ప్రశంసిస్తూ జాతీయ, అంతర్జాతీయ పత్రికలు రాశాయి. పలు వేదికలపై ఆమె ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడింది. ఒక పక్క పోరాటం చేస్తూనే మరోపక్క బాల్యవివాహాల నియంత్రణలో తన పనిని కొనసాగించింది. అయితే, గ్రామ పెత్తందారులు ఆమెను వెలి వేశారు. పాలు, పిండి ఇవ్వకుండా కట్టడిచేశారు. పిల్లలు ఆకలితో అల్లాడిపోయారు. నిందితులకు అండగా రాజకీయ నాయకులు నిలిచారు. చంపుతామని బెదిరించారు. అయినా ఆమె తొణకలేదు.
విచారణలో నిలువెల్లా కంపించిపోయింది
'దాడి జరుగుతున్నప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? మొదట ఎవరు దాడి చేశారు? వంటి ప్రశ్నలెన్నింటినో ఆమె విచారణలో ఎదుర్కొంది. ఈ విచారణంతా రహస్యంగా ఉంచాల్సిన యంత్రాంగం ఆమెను అవమానించాలని బయటికి చెప్పేసింది. దీంతో గ్రామంలో ఆమె బతుకు ఒక ఎగతాళి ఉదంతంగా మారిపోయింది. ''అప్పుడు నా పిల్లలు చదువుకోకుండా ఇంటికే పరిమితమయ్యారు. వందలసార్లు కోర్టు మెట్లెక్కాను. జరిగిన అన్యాయాన్ని పదేపదే గొంతుచించుకుని చెప్పాను. ఘటన జరిగిన మూడేళ్లకు విచారణ తుది దశకు చేరుకుంది.''
తీర్పులో ఏం చెప్పారంటే ...
ఇంత పోరాటం తరవాత వెలువడ్డ తీర్పు చాలా విచిత్రంగా ఉంది. 'గ్యాంగ్‌రేప్ జరిగిన తీరుపై బాధితురాలు చెబుతున్న అంశాలు నమ్మశక్యంగా లేవు. మేనల్లుడు, మేనమామ కలసి అత్యాచారం చేయరు. భిన్న కమ్యూనిటీలకు చెందిన పురుషులు బృందంగా కలసి అత్యాచారానికి పాల్పడరు. 73 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి తెగబడడు. తన కళ్లెదుటే భార్యను అత్యాచారం చేస్తుంటే ఏ భర్తా చూస్తూ ఊరుకోడు. ఇక గ్రామపెద్దగా ఉన్న వ్యక్తి ఎప్పటికీ అత్యాచారం చేయడు' ఇలా చెప్పి... నిందితులను నిర్దోషులుగా తేల్చేశారు.
'ఆరోజు.. నిందితులందరూ బయటికి వచ్చిన క్షణం, నా వెన్నులో వణుకుపుట్టింది. గ్రామంలో సంబరాలు చేశారు. టపాకాయలు కాల్చారు. పూలమాలలతో స్వాగతాలు పలికారు. విజయోత్సవ ర్యాలీ చేశారు. భన్వారీని మా చేతులకు అప్పగించండి.. లేకపోతే మీరైనా ఆమెను సజీవంగా కాల్చేయండి' అంటూ చాటింపు వేశారు. అప్పటి నుంచి నేను, నా కుటుంబం భయంతో గడిపాం. నా పిల్లలే నన్ను అసహ్యించుకునేలా చేశారు' అని ఆమె వివరించింది. అయినా, భన్వారీ వదిలి పెట్టలేదు. 1996లో న్యాయం కోసం మరోసారి అప్పీలు చేసింది.
ఇన్నేళ్లు గడిచినా ఆమెకు న్యాయం జరగలేదు. నిందితుల్లో ఒక్కరే ఇప్పుడు జీవించి వున్నారు. అతనికి శిక్ష పడాలని ఆమె ఎదురుచూస్తోంది. జీవితకాలం ఎదురుచూసినా న్యాయం జరగని భన్వారీ లాంటి మహిళలు దేశంలో ఎంతోమంది ఉన్నారు. బాధితులకు న్యాయం చేయకుండా ఎన్ని చట్టాలు చేసినా ప్రయోజనం లేదు !