Jun 01,2023 21:21
  • విశాఖ, కర్నూలు జిల్లాల్లో ఉద్యోగులు, పెన్షనర్లు మానవహారం, ర్యాలీ

ప్రజాశక్తి - కలెక్టరేట్‌ (విశాఖపట్నం), కర్నూలు జిల్లా : ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న వేజ్‌ రివిజన్‌, పెన్షన్‌ రివిజన్‌ను వెంటనే చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ గురువారం విశాఖ, కర్నూలు జిల్లాల్లో బిఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు, పెన్షనర్లు మానవహారం నిర్వహించారు. ఆల్‌ యూనియన్స్‌ అండ్‌ అసోసియేషన్స్‌ ఆఫ్‌ బిఎస్‌ఎన్‌ఎల్‌ (ఎయుఎబి) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. విశాఖ బిఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం నుంచి ఉద్యోగులు, పెన్షనర్లు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎల్‌ఐసి కార్యాలయ సమీపంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద మానవహారంగా ఏర్పాడ్డారు. ఈ సందర్భంగా సంఘం విశాఖ కన్వీనర్‌ పిఇసిహెచ్‌వి సాగర్‌ మాట్లాడుతూ 2015 నుంచి వేతన సవరణ జరపకపోవడం శోచనీయమన్నారు. స్టేగనేషన్‌ సమస్యను పరిష్కరించాలని, 4జి అనుమతి వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎగ్జిక్యూటివ్స్‌తో సమానంగా ప్రమోషన్‌ పాలసీ అమలు చేయాలని కోరారు. చాలాకాలంగా ఈ డిమాండ్ల సాధన కోసం జాతీయ స్థాయిలో జాయింట్‌ ఫోరం ఆధ్వర్యంలో పోరాటం సాగుతున్నా కేంద్రం స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఈ నేపథ్యంలో జులై 7న చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టాలని ఫోరం నిర్ణయించిందని తెలిపారు. దేశవ్యాప్తంగా బిఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు, పెన్షనర్లు వేలాదిగా ఈ కార్యక్రమానికి తరలిరానున్నారు. తమ పోరాటంలో భాగంగా ఈ నెల 14న రాష్ట్ర గవర్నర్‌కు వినతిపత్రం అందజేస్తామన్నారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు శ్రీకాంత్‌, సురేష్‌, రామాంజనేయులు, మూర్తి, సూర్య, గోవిందరాజులు పాల్గొన్నారు.
కర్నూలు జిల్లా ఎక్స్చేంజ్‌ అవరణలో ఫిష్‌ సర్కిల్‌లో జాయింట్‌ పోరం అండ్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ యూనియన్స్‌ కలసి మానవహారం నిర్వహించారు. బిఎస్‌ఎన్‌ఎల్‌ ఇయు జిల్లా కార్యదర్శి ఎన్‌ రామరాజు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో బిఎస్‌ఎన్‌ఎల్‌ ఇయు అండ్‌ ఎన్‌ఎఫ్‌టిఇ యూనియన్‌, ఎఐబిడిపిఎ నాయకులు ఎన్‌ రామరాజు, ఆదినారాయణ, మద్దిలేటి మాట్లాడారు. మూడవ పే రివిజన్‌, న్యూ ప్రమోషన్‌ పాలసీ, బిఎస్‌ఎన్‌ఎల్‌కు 4జి, 5జి సర్వీలను అందరం కలిసి సాధించుకోవాలని, బిఎస్‌ఎన్‌ఎల్‌ను కాపాడుకోవాలని కోరారు.

2