
- తగ్గుతున్న మహిళా భాగస్వామ్యం
- మరో మార్గం లేక స్వయం ఉపాధి పనులు
- అదే ఘనంగా చెప్పుకుంటున్న కేంద్రం
న్యూఢిల్లీ : ఎప్పుడు అమలులోకి వస్తాయో తెలియని రిజర్వేషన్లను చట్టసభల్లో కల్పించడం ద్వారా మహిళా లోకాన్ని ఉద్దరించేసినట్లు మోడీ సర్కారు ఒకవైపు ప్రచారం చేసుకుంటుండగా, మరోవైపు పూటగడవడం కూడా కష్టంగా మారుతున్న దుస్థితి క్షేత్రస్థాయిలో మహిళలకు నెలకొంటోంది. పొట్టగడవడం కోసం చేసే రోజువారి కూలి పనుల్లో మహిళల వాటా గణనీయంగా తగ్గుతోంది. గత నాలుగు సంవత్సరాలుగా ఇదే పరిస్థితి నెలకొంది. నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీసు (ఎన్‌ఎస్‌ఓ) విడుదల చేసిన తాజా పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పిఎల్‌ఎఫ్‌ఎస్) ఆధారంగా 'బిజినెస్ స్టాండర్డ్ ' ఈ విశ్లేషణ చేసింది. కరోనా రక్కసి విజృంభణకు ముందు 2018-19 సంవత్సరంలో సాధారణ వేతన పనిలో మహిళల వాటా 21.9 శాతం ఉండగా, ఆ తరువాత నుండి క్రమేణా తగ్గుతూ 2022-23 సంవత్సరానికి 15.9 శాతానికి పడిపోయింది. శ్రమశక్తిలో మహిళల వాటా తగ్గడానికి అనేక కారణాలున్నట్లు వివిధ సంస్థలు చేసిన అధ్యయనాల్లో తేలింది. వేతనాల్లో వివక్ష చూపించడం. పనిప్రదేశాల్లో కనీస భద్రత లేకపోవడం, కరోనా అనంతర పరిస్థితుల్లో ఇంటి పని ఎక్కువ కావడం వంటివి వీటిలో ఉన్నాయి. ఇలా వివిధ కారణాలతో రోజువారి కూలీకి వెళ్లలేని మహిళలు ఇళ్లవద్దే సొంతంగా ఏదో ఒక పని చేసుకుంటున్నారు. ఫలితంగా స్వయంగా ఉపాధి రంగంలో మహిళల వాటా పెరుగుతోంది. కరోనాకు ముందు స్వయం ఉపాధి రంగంలో మహిళల వాటా 53.4శాతంగా ఉండగా, 2022-23 నాటికి 65.3 శాతానికి పెరిగింది. ఇళ్ల వద్ద రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా వీరిలో అత్యధికులకు రోజువారీ కూలి కూడా దక్కడం లేదు. నామమాత్రపు మొత్తాలతో సరిపెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. దీనిని కూడా తమ ఘనతగా చెప్పుకోవడానికి మోడీ ప్రభుత్వం సిద్ధపడుతోంది. స్వయం ఉపాధి రంగంలో మహిళలు పెద్దఎత్తున ముందుకు వస్తున్నారని, అందువల్లే వేతన కూలీల్లో వారి సంఖ్య తగ్గుతోందని కేంద్రం చెబుతోంది. కొద్ది రోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం 'కొన్ని సంవత్సరాలుగా మహిళా సాధికారత కోసం తాము చేపట్టిన పథకాలు గణనీయమైన ఫలితాలు సాధించాయి' అని ఆయన అన్నారు.

వాస్తవం ఏమిటి ?
2018-19లో 53 శాతంగా ఉన్న స్వయం ఉపాధి రంగం ఆ తరువాత క్రమేణా పెరిగింది. 2020-21 సంవత్సరంలో 55.6శాతంగానూ, 2021-22లో 55.8శాతంగానూ, 2022-23 కు 57.3శాతానికి స్వయం ఉపాధి రంగం చేరింది. వీరిలో అత్యధికులు మహిళలన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలా స్వయం ఉపాధి పొందుతున్న మహిళల్లో పలువురికి సాధారణ వేతన మొత్తం కూడా దక్కడం లేదు. అయినా, భవిష్యత్తుపై గంపెడాశతో రెక్కలు ముక్కలు చేసుకుంటున్న వారి సంఖ్య గణనీయంగానే ఉంది. 2020-21లో 17.3శాతంగా ఉన్న వీరి సంఖ్య 2022-23 నాటికి 18.3శాతానికి పెరిగింది. 'ఇంటి వద్ద నుండే చిన్నా చితక పనిచేస్తూ స్వయం ఉపాధి పొందాలని ఆశించే వారికి ఏమీ దక్కడం లేదు. ఆర్థిక వ్యవస్థలో వీరి సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకర పరిణామం' అని నిపుణులు అంటున్నారు.