Nov 03,2023 10:43
  • పదవి చేపట్టిన రెండేళ్లవుతున్నా అందని వేతనాలు
  • రూ.మూడు వేలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం
  • ఇదేం దారుణమంటున్న ఎంపిటిసిలు
  • పలుచోట్ల బిల్లులు పెట్టినట్లు చెబుతున్నా అందని పరిస్థితి
  • ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 870 మంది ఎంపిటిసిలు

ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి : స్థానిక ప్రజాప్రతినిధులైన ఎంపిటిసిలకు గెలిచిన తర్వాత ఇప్పటివరకూ జీతాలివ్వని పరిస్థితి నెలకొంది. దీంతో అసలు ఎంపిటిసిలకు జీతాలిస్తారా?లేదా? అన్న అనుమానం నెలకొంది. పలుమండలాల్లో బిల్లులు పెట్టినట్లు చెబుతున్నా జీతాలు మాత్రం అందడం లేదు. ఉమ్మడి జిల్లాలో 48 మండలాలుండగా 870 మంది వరకూ ఎంపిటిసిలున్నారు. వీరంతా ఎంతో ఖర్చుపెట్టి ఎన్నికల్లో గెలిచారు. ఎంపిటిసిలకు గ్రామాల్లో సరైన ప్రాధాన్యత లేకుండాపోయింది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపిటిసిల పరిస్థితి అయితే వేరేచెప్పనక్కర్లేదు. కనీసం వేతనాలు కూడా ఇవ్వడం లేదు. ఎంపిటిసిలకు నెలకు రూ.మూడు వేలు గౌరవ వేతనంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఎంపిటిసిలు పదవీబాధ్యతలు చేపట్టి రెండేళ్లు గడిచిపోయింది. ఇప్పటి వరకూ జీతాల ఊసే లేదు. దాదాపు ఒక్కో ఎంపిటిసికి వేతనం కింద రూ.70వేలకు పైగా అందాల్సి ఉంది. ప్రజాప్రతినిధులకు నిత్యం అనేకవిధాలుగా ఖర్చులు ఉంటాయి. పెండింగ్‌ జీతం ఇస్తే ఏదో ఒక ఖర్చుకు వస్తుందన్న భావన ఎంపిటిసిల్లో వ్యక్తమవుతోంది. ఏజెన్సీతోపాటు, ఎస్‌సి, బిసి సామాజిక తరగతికి చెందిన పలువురు ఎంపిటిసి ల్లో రోజువారీ పనిచేసుకుని జీవించేవారు సైతం ఉన్నారు. ప్రజాప్రతినిధిగా ఎంపికైన తర్వాత గ్రామాల్లో తిరగడం వంటి అనేక పనులు ఉండటంతో ఖర్చులు తప్పవు. ప్రభుత్వం నుంచి వేతనాల రూపంలో రావాల్సిన సొమ్ములు రాకపో వడంతో చాలామంది ఎంపిటిసిలు ఇబ్బందులు పడుతున్నారు. ఎంపిటిసిల్లో వేతనాల గురించి పట్టించుకునేవారు ఎవరున్నారంటూ చర్చ నడు స్తోంది. ఎంపిటిసిలంతా ధనవంతులు కాదని, రిజర్వేషన్‌ సీట్లలో రోజువారీ పనిచేసుకునే నాయ కులు సైతం ఉన్న పరిస్థితి నెలకొంది. ఎంపిటిసిల జీతాల గురించి ఏ ఒక్కరూ మాట్లాడటం లేదు. ఎంఎల్‌ఎలకు, ఎంపీలకు ప్రతినెలా ప్రభుత్వం జీతాలు ఇచ్చేస్తోంది. మరి స్థానిక ప్రజాప్రతినిధు లకు మాత్రం ఏళ్లతరబడి జీతాలివ్వడం లేదు. పంచాయతీ సర్పంచులు ఎన్నికై రెండున్నరేళ్లు దాటిపోగా తొమ్మిది నెలల వేతనంగా ఏలూరు జిల్లాలో దాదాపు రూ.1.50 కోట్లను రెండురోజుల క్రితం ప్రభుత్వం విడుదల చేసింది. ఎంపిటిసిలకు మాత్రం అదికూడా లేకుండా పోయింది. గ్రామాల అభివృద్ధిలో స్థానిక ప్రజాప్రతినిధులదే కీలకపాత్ర. ఎంఎల్‌ఎలకు, ఎంపిలకు రూ.లక్షల్లో జీతాలు, అలవెన్సులు ఇస్తున్న ప్రభుత్వం స్థానిక ప్రజాప్రతినిధులైన సర్పంచులకు, ఎంపిటిసిలకు మాత్రం రూ.మూడువేలు వేతనం మాత్రమే ఇస్తోంది. ఆ సొమ్ము కూడా సకాలంలో ఇవ్వని పరిస్థితి నెలకొంది. ప్రజలకు నిత్యం దగ్గరగా సర్పంచులు, ఎంపిటిసిలే ఉంటారు. అలాంటి ప్రజాప్రతినిధుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పలు చోట్ల ఎంపిటిసిలకు కొన్నినెలల వేతన సొమ్ము జమైనట్లు చెబుతున్నా స్పష్టత లేకుండా పోయిం ది. ఎంపిటిసిల జీతాల పెండింగ్‌కు సంబంధించి ప్రజాప్రతినిధుల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటికే వాలంటీర్‌, సచివాలయ వ్యవస్థలను తెచ్చి స్థానిక ప్రజాప్రతినిధులైన సర్పంచి, ఎంపిటిసిలను ప్రభుత్వం ఉత్సవ విగ్రహాలుగా మార్చేసింది. ప్రభుత్వ పథకాలన్నీ ప్రజాప్రతినిధు లతో సంబంధం లేకుండానే జరిగిపోతున్నాయి. పంచాయతీలకు వచ్చే ఆర్థికసంఘం నిధులను సైతం కరెంటు బిల్లుల పేరుతో ప్రభుత్వం లాగేసుకుంటుంది. దీంతో గ్రామాల్లో అభివృద్ధి లేకుండాపోయింది. స్థానిక ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సిన జీతాల విషయంలోనూ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. ఎంపిటిసిలకు పెండింగ్‌ జీతాలు జమచేయాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.