
తొర్రూరు: ఓటు వేసే ముందు ప్రజలు అన్నీ ఆలోచించి వేయాలని బిఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో నిర్వహించిన బిఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు.''ఎన్నికలు అనగానే ఎందరో వస్తున్నారు.. ఏవేవో మాట్లాడుతున్నారు. ఓటు వేసే ముందు ప్రజలు అన్నీ ఆలోచించి వేయాలి. నిజానిజాలు గమనించి ఓటు వేయాలని కోరుతున్నా. పదేళ్ల ముందు పాలకుర్తి ఎలా ఉంది.. ఇప్పుడెలా ఉందో ప్రజలు ఆలోచించాలి. గతంలో ఇక్కడి నుంచి వేల మంది వలసపోయేవారు. ఇప్పుడు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో లక్షా 30వేల ఎకరాలకు సాగునీరిచ్చాం''అని కేసీఆర్ అన్నారు.
రైతుబంధు దుబారా అని కాంగ్రెస్ నేతలు అంటున్నారని కేసీఆర్ మండిపడ్డారు. 24 గంటల విద్యుత్ వద్దని.. 3 గంటలు చాలని పీసీసీ అధ్యక్షుడే చెబుతున్నారని.. నాయకుల గోల్‌మాల్ మాటలు విని ఆగం కావొద్దని ప్రజలను ఆయన కోరారు. దేశాన్ని 50 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్‌తో మన బతుకులు మారాయా? అని కేసీఆర్ ప్రశ్నించారు.