హైదరాబాద్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తాను ఇచ్చిన స్టేట్మెంట్‌ను సీబీఐ మార్చేసిందని మాజీ ఐఏఎస్ అధికారి అజేయకల్లం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ తన వాంగ్మూలాన్ని తప్పుగా నమోదు చేసిందని అందులో వెల్లడించారు.
వివేకా హత్య రోజున ఏం జరిగిందో తన స్టేట్మెంట్ రికార్డు సమయంలో సీబీఐకి వివరించానని తెలిపారు. 2019 మార్చి 15 ఉదయం జగన్ నివాసంలో మేనిఫెస్టోపై సమావేశం ప్రారంభమయిందని... సమావేశం మొదలైన గంటన్నర తర్వాత అటెండర్ వచ్చి డోర్ కొట్టారని అజేయకల్లం చెప్పారు. దీంతో ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి బయటకు వెళ్లి, తిరిగి వచ్చి జగన్‌కు ఏదో చెప్పారని తెలిపారు. ఆ తర్వాత జగన్ షాక్‌కు గురైనట్టుగా లేచి, చిన్నాన్న చనిపోయారని చెప్పారని అన్నారు. ఇదే విషయాన్ని తాను సీబీఐకి చెప్పానని, ఇంతకు మించి మరేమీ చెప్పలేదని తెలిపారు. జగన్ భార్య భారతి ప్రస్తావనను కానీ, ఇతర అంశాలను కానీ తాను సీబీఐ విచారణలో తీసుకురాలేదని ఆయన చెప్పారు. తాను చెప్పనివి సీబీఐ ఛార్జ్ షీట్‌లో ఉన్నాయని, సీబీఐ అన్నీ అబద్ధాలనే పేర్కొందని అన్నారు. దర్యాప్తును తప్పుదోవ పట్టించేలా సీబీఐ వ్యవహరిస్తోందని ఆరోపించారు. తన స్టేట్మెంట్‌గా పేర్కొన్న అంశాలను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో అజేయకల్లం పిటిషన్ వేశారు.










