- ఢిల్లీ హింసాత్మక అల్లర్లకు నేటికి మూడేళ్లు
న్యూఢిల్లీ : నేటికి సరిగ్గా మూడేళ్ల క్రితం చోటుచేసుకున్న ఢిల్లీ అల్లర్లు ఇప్పటికీ మానని గాయాలను మిగిల్చాయి. బిజెపి నాయకుల తీరుతో ఆ అల్లర్లు రెండు వర్గాల మధ్య గొడవగా చిత్రీకరించబడ్డాయి. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)పై కేంద్రం మొండి వైఖరిపై అప్పట్లో దేశరాజధానితో పాటు వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసనలు, ప్రదర్శనలు, ఆందోళనలకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈశాన్య ఢిల్లీలో ఈ ఆందోళనలు తారాస్థాయికి చేరాయి. భౌతిక దాడులు, రాళ్లు విసురుకోవడంతో పాటు.. కొందరు వ్యక్తులు తుపాకులతో రావడం వంటి దృశ్యాలు కనబడ్డాయి. ఈ ఘటనలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, పోలీసుల వైఫల్యాన్ని నిజనిర్ధారణ కమిటీ ఎత్తి చూపింది. అల్లర్లతో ప్రభావితమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించడంలో ఆలస్యం చేసిందని, ప్రత్యేక బ్రాంచ్, నిఘా విభాగాల నుంచి వచ్చిన హెచ్చరికలను ఢిల్లీ పోలీసులు లెక్క చేయలేదని వివరించింది. మీడియా కథనాలు, బిజెపి నాయకుల వ్యవహార శైలి వంటి కారణాలతో ఈశాన్య ఢిల్లీ అల్లర్లు మూడు రోజులపాటు కొనసాగి తీవ్ర ఆస్తి, ధన, ప్రాణ నష్టాలను మిగిల్చాయని కమిటీ వెల్లడించింది. 2020 ఫిబ్రవరి అల్లర్లపై సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ బి లోకూర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల నిజ నిర్ధారణ కమిటీ దర్యాప్తు జరుపుతున్నది. కేంద్ర హోంశాఖ, ఢిల్లీ పోలీసుల నిర్లక్ష్య వైఖరిని కమిటీ ఎత్తి చూపటంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. అల్లర్లు మొదలయ్యే రోజు ఫిబ్రవరి 23న ఢిల్లీ పోలీసులకు స్పెషల్ బ్రాంచ్, నిఘా యూనిట్ల నుంచి ఆరుసార్లు హెచ్చరికలు వచ్చినా పట్టించుకోలేదని వివరించింది. ఆ తర్వాత రెండు రోజుల వరకూ అల్లర్లు చోటుచేసుకున్న ప్రాంతాలకు అదనపు బలగాలు చేరుకోలేదు. చివరకు ఫిబ్రవరి 26న అదనపు బలగాలను మోహరించడం గమనార్హం. కేంద్ర హోంశాఖ చూపిన ఉదాసీన వైఖరి అల్లర్లు చేసేవారికి ఊతమిచ్చినట్టయిందనీ, వరుసగా మూడు రోజులపాటు హింసను మరింతగా సృష్టించారనీ కమిటీ వివరించింది.
ఎఫ్‌ఐఆర్‌పై కోర్టులో సాక్షాత్తూ ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన చార్జిషీటు.. కమిటీ ఆరోపణలకు బలాన్ని చేకూర్చేలా ఉండటం గమనార్హం. ఈ ఎఫ్‌ఐఆర్‌లో సామాజిక కార్యకర్తలు, విద్యార్థి నాయకులు ఉమర్ ఖాలీద్, ఖాలీద్ సైఫీ, ఇష్రత్ జహాన్, గుల్ఫిషా ఫాతిమా, సఫూరా ఝర్గార్, నటాషా నార్వల్, దేవాంగన కలిత, ఇతరులపై ఉపా కింద పేర్లు చేర్చిన విషయం విథితమే. ఢిల్లీ అల్లర్లు చెలరేగిన 23, 24, 25 తేదీల్లో మోహరించిన ఢిల్లీ పోలీసులతో పాటు కేంద్ర బలగాల సిబ్బంది సంఖ్య 1400 మంది లోపే ఉంది. 26న ఆ సంఖ్య 4,200కు పైగా చేరుకుంది. 25న 3,500 అత్యవసర ఫోన్ కాల్స్ రాగా, 26న 1500కు పడిపోయాయి. మొత్తానికి కేంద్ర హోంశాఖ నిర్లక్ష్య వైఖరి, ఢిల్లీ పోలీసుల సహకారం, మీడియా విభజిత కథనాలు, సిఎఎకు వ్యతిరేకంగా దాదాపు రెండు నెలలకు పైగా నిరసనల్లో ఉన్న ముస్లిములకు వ్యతిరేకంగా బిజెపి చేసిన ద్వేషపూరిత ప్రచారం.. ఢిల్లీ అల్లర్లకు కారణమైందని కమిటీ తన దర్యాప్తులో వివరించింది.










