ఫ్లోరిడా : అమెరికాలో తుపాకీ సంస్కృతికి అడ్డు అదుపులేకుండా పోతోంది. గత వారం మెయినేలోని లూయిస్టన్ పట్టణంలో 22 మంది ప్రాణాలు బలిగొన్న అత్యంత ఘోరమైన సామూహిక కాల్పుల ఘటన నుంచి కోలుకోక ముందే ఆదివారం హాలోవెన్ సంబరాల సందర్భంగా చోటు చేసుకున్న వేర్వేరు కాల్పుల ఘటనల్లో 12 మంది చనిపోయారు. డజన్ల కొద్దీ గాయపడ్డారు. ఫ్లోరిడాలోని టాంపా నైట్ క్లబ్‌లో ఆదివారం తెల్లవారు జామున ఇరు గ్రూపుల మధ్య తలెత్తిన ఘర్షన కాల్పులకు దారి తీసింది. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించారు. మరో 13 మంది గాయపడ్డారు. నిందితుడిగా అనుమానిస్తున్న టైరెల్ స్టీఫెన్ ఫిలిప్స్ (22)ను అరెస్టు చేసినట్టు టాంపా పోలీసు చీఫ్ లీ బెర్సా తెలిపారు. ఇండియానా పోలిస్‌లో జరిగిన కాల్పుల్లో ఒకరు మరణించారు. అమెరికాలో ఈ ఏడాది ఇంతవరకు 580 దాకా కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. చికాగో, కాన్సాస్‌లలో జరిగిన కాల్పుల్లో 9 మంది దాకా చనిపోయారు.