Oct 09,2023 21:11
  • బిజెపి ప్రభుత్వ విధానాలపై ఆదివాసీల్లో తీవ్ర వ్యతిరేకత
  • 'ఆదివాసీ ప్రాంత సమగ్రాభివృద్ధి-ప్రత్యామ్నాయ విధానాలు'పై రాష్ట్ర సదస్సులో మిడియం బాబూరావు

ప్రజాశక్తి- పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) : గిరిజన చట్టాలకు కేంద్రంలోని మోడీ సర్కారు తూట్లు పొడుస్తోందని, ఆ ప్రభుత్వ విధానాలపై ఆదివాసీల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని సిపిఎం మాజీ ఎంపి మిడియం బాబూరావు అన్నారు. 'ఆదివాసీ ప్రాంత సమగ్రాభివృద్ధి - ప్రత్యామ్నాయ విధానాలు' అనే అంశంపై సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం పాడేరులోని కాఫీ హౌస్‌లో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిఒ నెంబర్‌ 3ని రద్దు చేయడంతో గిరిజన ప్రాంతంలోని టీచర్‌ పోస్టులు 50 శాతం మాత్రమే గిరిజనులకు దక్కుతున్నాయని, మిగిలినవి గిరిజనేతరులకు కేటాయిస్తున్నారని తెలిపారు. దీంతో, ఆదివాసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. తక్షణం జిఒ నెంబర్‌ 3 పునరుద్ధరణకు ఆర్డినెన్స్‌ తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ఆర్టికల్‌ 275 (1) కింద గిరిజన ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు ఇచ్చే నిధులను కేంద్ర ప్రభుత్వం జనరల్‌ స్కీములలో వేయడం శోచనీయమన్నారు. ప్రణాళిక సంఘం రద్దయిపోవడంతో ట్రైబల్‌ సబ్‌ప్లాన్‌ను బిజెపి ప్రభుత్వం రద్దుచేసి, ట్రైబల్‌ స్పెషల్‌ స్కీం పేరుతో కొనసాగిస్తున్నప్పటికీ నిధులు పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదని తెలిపారు. ఇటీవల తీసుకొచ్చిన అటవీ పరిరక్షణ సవరణ చట్టం వల్ల ఇప్పటివరకూ ఉన్న గిరిజన హక్కులు హరించబడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఏజెన్సీలో ఎక్కడైనా ఏదైనా ప్రాజెక్ట్‌ అమలు చేయాలంటే గ్రామ సభ తీర్మానం ఉండాల్సి ఉన్నా, నేడు దానికి విలువ లేకుండా పోయిందని తెలిపారు. కార్పొరేట్‌ కంపెనీలకు అడవిని కట్టబెట్టేందుకే పాలకులు చట్టాలకు తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. ఆదివాసీల భాష, సంస్కృతి, ఆహారపు అలవాట్లపై బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ దాడి పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజనులను విదేశీయులుగా, క్రిస్టియన్లుగా చిత్రీకరించడం, ఎస్‌టి ధ్రువపత్రాల జారీని నిరాకరించడం వంటి చర్యలకు పాలకులు పాల్పడుతున్నారని, వాటిని సిపిఎం తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంలో షెడ్యూల్డ్‌ ప్రాంత సమస్యలు, పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి సిపిఎం చేపడుతున్న ప్రజారక్షణ భేరి యాత్రకు సన్నద్ధంగా ఈ సదస్సు నిర్వహించినట్లు తెలిపారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గిరిజనుల పట్ల అవలంభిస్తోన్న విధానాలకు వ్యతిరేకంగా ఆదివాసీల పోరాటాలు తీవ్రమవుతున్నాయన్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ వైద్య సదుపాయాలు మృగ్యమయ్యాయని తెలిపారు. అందరికీ మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని, జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలని సిపిఎం డిమాండ్‌ చేస్తోందన్నారు. ఆదివాసీల ఆరోగ్య సమస్యలపై చేసిన పోరాటాల వల్లే పాడేరుకు మెడికల్‌ కళాశాల వచ్చిందని తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం మాట్లాడుతూ ఆదివాసీల సమగ్రాభివృద్ధి లక్ష్యంతో రాష్ట్రంలో ఈ నెల 21 నుంచి సీతంపేట ఐటిడిఎ పరిధిలోని పాలకొండ నుంచి ప్రజా రక్షణభేరి యాత్ర ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఆ యాత్ర పార్వతీపురం మన్యం, విజయనగరంలోని పలు మండలాల మీదుగా అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరిలోకి ప్రవేశిస్తుందని తెలిపారు. ఆ తరువాత పాడేరు, రంపచోడవరం మీదుగా నవంబర్‌ ఒకటి నాటికి విజయవాడ చేరుకుంటుందని వెల్లడించారు. సిపిఎం అల్లూరి జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కిల్లో సురేంద్ర, అనంతగిరి జడ్‌పిటిసి సభ్యులు దీసరి గంగరాజు, జిల్లా నాయకులు వి.ఉమామహేశ్వరరావు, బోనంగి చిన్నయ్యపడాల్‌, హైమావతి, చిన్నంనాయుడు, అవినాష్‌ తదితరులు పాల్గొన్నారు.