Aug 03,2023 22:45

ప్రజాశక్తి- యంత్రాంగం :మణిపూర్‌లో ఆదివాసీలపై మారణహోమాన్ని నిరసిస్తూ చేపట్టిన గురువారం చేపట్టిన ఏజెన్సీ బంద్‌ విజయవంతమైంది. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, ఏలూరు జిల్లాల్లో ఆర్‌టిసి బస్సులు, ప్రయివేట్‌ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. బ్యాంకులు, వర్తక, వాణిజ్య సంస్థలు, హోటళ్లు మూతపడ్డాయి. వ్యాపారులు తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి బంద్‌కు మద్దతు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రయివేట్‌ రంగాల్లో కార్యకలాపాలు స్తంభించాయి. బంద్‌లో భాగంగా ప్రదర్శనలు, ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. ఆదివాసీ గిరిజన సంఘం, గిరిజన సమాఖ్య, పలు ఆదివాసీ సంఘాలు బంద్‌ విజయవంతానికి కృషి చేశాయి. పర్యాటక కేంద్రాలైన అరకులోయలోని గిరిజన మ్యూజియం, పద్మావతి గార్డెన్‌, కాఫీ మ్యూజియం, అనంతగిరిలోని బర్రా గుహలు మూతపడ్డాయి. చాపరాయి, కటికి, తాడిగుడ, జలపాతాలు నిర్మానుష్యంగా మారాయి. పెదబయలులో ఉదయం ఆరు గంటల నుండి జోరు వర్షం పడుతున్నా బంద్‌ విజయవంతమైంది. ముంచంగిపుట్టు నాలుగు రోడ్లు కూడలి నుంచి పోలీస్‌ స్టేషన్‌ బస్‌ స్టాప్‌ వరకు ర్యాలీ నిర్వహించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దిష్టిబమ్మను దగ్ధం చేశారు. చింతపల్లిలో హనుమాన్‌ జంక్షన్‌ నుంచి సంతపాకల వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ మానవహారంగా ఏర్పడ్డారు. రంపచోడవరంలో వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులు మూసివేసి బంద్‌కు సంపూర్ణ తెలిపారు. అంబేద్కర్‌ కూడలిలో నిర్వహించిన రాస్తారోకోలో ఎపి ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు, అరకులో గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర, పాడేరులో ఆదివాసి గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు పి.అప్పలనర్స మాట్లాడుతూ మణిపూర్‌ రాష్ట్రంలో జరుగుతున్న హింసకాండ, మారణ హోమాన్ని ఆపాలని డిమాండ్‌ చేశారు. ఆ రాష్ట్రంలోని సహజ వనరులను బడా పెట్టుబడిదారులకు అప్పజెప్పడానికి అక్కడి బిజెపి ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలంతో కుకి, నాగ గిరిజన జాతులపై గిరిజనేతరులైన మైతీలతో దాడులు చేయిస్తూ మారణ హోమం సృష్టిస్తోందని విమర్శించారు. అత్యాచారాలు, దాడులపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపకపోవడం శోచనీయమన్నారు. చర్చిలు, మసీదులపై దాడి చేసే హక్కు బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఇద్దరు మహిళలను వివస్త్రను చేసి ఊరేగిస్తుంటే, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం దారుణమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం శోచనీయమన్నారు. దేశవ్యాప్తంగా అటవీ సంపదను ప్రయివేట్‌ కార్పొరేట్‌ శక్తులకు అప్పగించడానికి అటవీ చట్టానికి సవరణ చేశారని, ఇది అమలైతే గిరిజన ప్రాంతాల్లో గ్రామసభలకు ఉన్న అధికారం నిర్వీర్యం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సవరణలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. మారేడుమిల్లిలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాజవొమ్మంగిలో ప్రధాన రహదారిపై బైఠాయించారు. చింతూరు ఏజెన్సీలోని చింతూరు, విఆర్‌.పురం మండల కేంద్రాల్లో ర్యాలీ నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో ఆటోలు, ట్రక్కర్ల యజమానులు, రిక్షా కార్మికులు బంద్‌కు సహకరించారు. ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యాన గిరిజనులు ఎల్విన్‌పేట నుంచి గుమ్మలక్ష్మీపురం వరకు ర్యాలీ నిర్వహించారు. పార్వతీపురంలో అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. కురుపాం మండలం రావాడ జంక్షన్‌ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోలక లక్షణమూర్తి, గిరిజన సంఘం, గిరిజన అభ్యుదయ సంఘం నాయకులు పాల్గన్నారు. ఏలూరు జిల్లా బుట్టాయగూడెంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నుంచి నెహ్రూ బమ్మ కూడలి వరకూ ప్రదర్శన, అనంతరం అక్కడ మానవహారం నిర్వహించారు.