
ఎపి వ్యకాస ఆధ్వర్యాన పాదయాత్ర ప్రారంభం
ప్రజాశక్తి- టి.నరసాపురం (ఏలూరు జిల్లా) :రాష్ట్ర ప్రభుత్వం పేదలు, దళితుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ.రవి విమర్శించారు. ఎర్ర కాలువ మిగులు భూముల్లో పేదలు సాగు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని, ఈ ప్రాంతంలోని అసైన్డ్, సీలింగ్ భూములను పేదలకు పంచాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం తలపెట్టిన పాదయాత్రను ఏలూరు జిల్లా టి.నర్సాపురం మండలం మధ్యాహ్నపువారి గూడెంలో జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎ.రవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భూపంపిణీ చేస్తామని ప్రకటించి అసైన్డ్ భూముల చట్ట సవరణ చేయడం దుర్మార్గమన్నారు. 9/77 చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకుందని విమర్శించారు. పేదలు, దళితులు, గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు హక్కు పత్రాలు ఇవ్వకపోగా ఈ చట్ట సవరణ ద్వారా 20 ఏళ్లు ఎవరైతే ఎంజారుమెంట్‌లో ఉన్నారో వారికే పట్టాలిస్తామని చెప్పడం దుర్మార్గమన్నారు. ఎర్రకాల్వ మిగులు భూముల పట్ల చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా, పోలవరం ఎమ్మెల్యే బాలరాజు స్పందించి పేదలకు, దళితులకు, గిరిజనులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.జీవరత్నం, పి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.