Jul 26,2023 20:32
  • కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య టివి కట్టమణి

ప్రజాశక్తి-కలెక్టరేట్‌, విశాఖ : నైపుణ్య భారతావని నిర్మాణానికి నూతన విద్యా విధానం ఉపయుక్తంగా నిలుస్తుందని కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ఉప కులపతి టివి.కట్టమణి అన్నారు. నూతన విద్యా విధానం-2020 అమలు చేసి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా విశాఖలోని దసపల్లా హోటల్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నైపుణ్యాలతో కూడిన యువతను తీర్చిదిద్ది సమాజానికి అందించడానికి నూతన విద్యా విధానం ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ విధానంలో విద్యార్థి కేంద్రీకృతంగా బోధన జరుగుతుందన్నారు. విద్యా వ్యవస్థను పరిశ్రమలకు అనుసంధానం చేస్తూ అందుకు అనుగుణంగా యువతను సిద్ధం చేసే అవకాశం ఏర్పడిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో సువిశాల తీర ప్రాంతం ఉందని, దీనిని అవకాశాల వేదికగా యువత మార్చుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన వర్సిటీ ఏర్పాటుకు 561 ఎకరాల భూమిని కేటాయించి తమకు అందించిందని, ప్రస్తుతం మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేస్తూ నిర్మాణానికి సంస్థ ఎంపిక జరుగుతోందని చెప్పారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ఆచార్య వి.కృష్ణమోహన్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని ప్రకటించిన వెంటనే ఆంధ్ర విశ్వవిద్యాలయం వంద శాతం కార్యరూపంలోకి తీసుకొచ్చిందన్నారు. శ్రీకాకుళంలోని డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య నిమ్మ వెంకట్రావు మాట్లాడుతూ.. తమ విశ్వవిద్యాలయంలో వివిధ పరిశ్రమల సహకారంతో నిర్వహిస్తోన్న కోర్సులు, నూతన విద్యా విధానం విద్యార్థులకు ఉపయుక్తంగా నిలుస్తున్న అంశాలను వివరించారు. కార్యక్రమంలో విజయనగరంలోని జెఎన్‌టియు ఉపకులపతి ఆచార్య బి.వెంకటసుబ్బయ్య, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం ఎనర్జీ డైరెక్టర్‌ డాక్టర్‌ శాలివాహన్‌, ఐఐఎం విశాఖపట్నం ప్రతినిధి ఆచార్య షమిమ్‌ జావేద్‌ తదితరులు పాల్గొని ప్రసంగించారు.