Nov 10,2022 06:34

త్వరలో జరగనున్న గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకోసం కేంద్రంలో ఉన్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని బిజెపి తొక్కుతున్న అడ్డదారులు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. ప్రజలను చీల్చి అధికారాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా ఆ రెండు రాష్ట్రాల్లోనూ ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని ఆ పార్టీ ఎన్నికల ఎజెండాలోకి చేర్చింది. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఈ అంశాన్ని దశలవారీగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తామంటూ కేంద్ర మంత్రులు అడ్డగోలు ప్రచారం చేస్తున్నారు. దీనిపై విమర్శలు చెలరేగుతుండగానే నవంబర్‌ నెలలోనూ ఎలక్టోరల్‌ బాండ్స్‌ అమ్మకాలకు అనుమతిచ్చింది. ఈ మేరకు వాటి విక్రయాలకు సంబంధించిన నిబంధనలను సవరిస్తూ గుట్టుచప్పుడు కాకుండా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎన్నికల వేళ కార్పొరేట్‌ నిధుల ప్రవాహానికి గేట్లు ఎత్తివేసినట్టైంది. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన తరువాత ఓటర్లను ప్రభావితం చేసే ఎటువంటి చర్యలైనా కోడ్‌ ఉల్లంఘన కిందకే వస్తాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరోవైపు ఎలక్టోరల్‌ బాండ్స్‌ పథకమే రాజ్యాంగ వ్యతిరేకమంటూ దాఖలైన పిటిషన్లను డిసెంబర్‌ ఆరవ తేదీన సుప్రీంకోర్టు విచారించనుంది.
2018లో ఎలక్టోరల్‌ బాండ్స్‌ను ప్రవేశపెడుతూ జారీ చేసిన నిబంధనల ప్రకారం ప్రతి ఏటా జనవరి, ఏప్రిల్‌, జులై, అక్టోబర్‌ నెలల్లో ప్రతి నెల పదిరోజులు ఎలక్టోరల్‌ బాండ్లను విక్రయిస్తారు. సాధారణ ఎన్నికలు జరిగే సంవత్సరంలో అదనంగా మరో 30 రోజులు బాండ్ల అమ్మకానికి అవకాశం ఉంది. ఈ నిబంధనలను జారీ చేసిన మొదటి సంవత్సరంలోనే మోడీ ప్రభుత్వం వీటిని ఉల్లంఘించింది. ఆ తరువాత ప్రతిఏడూ ఏదో రూపంలో అతిక్రమణలు చోటుచేసుకుంటున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎలక్టోరల్‌ బాండ్లను కార్పొరేట్‌ సంస్థలు కొనుగోలు చేసి తమకు నచ్చిన రాజకీయ పార్టీకి విరాళంగా ఇవ్వొచ్చు. ఈ ప్రక్రియలో ఆ సంస్థల పేర్లు వెల్లడి కావని, పారదర్శకంగా ఎన్నికల విరాళాలు ఉంటాయని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఆచరణలో దీనికి భిన్నంగా జరుగుతోంది. బాండ్లు విక్రయించే బ్యాంకుల నుండి ఏ సంస్థ ఎంత మొత్తంలో కొనుగోళ్లు చేసిందన్న వివరాలు కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు చేరుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. దీంతో, అధికారంలో ఉన్నవారికి వివిధ రకాలుగా ఆ సంస్థలపై ఒత్తిడి చేసే అవకాశం లభిస్తోంది. ఈ పథకం అమలులోకి వచ్చినప్పటి నుండి ఇతర పార్టీలకు విరాళాలు భారీగా తగ్గిపోవడం, అధికారంలో ఉన్న బిజెపికి సింహభాగం లభించడం ఈ ఆరోపణలనే ధ్రువపరుస్తున్నాయి. దీంతో పాటు, 'నీకు అది..నాకు ఇది' (క్విడ్‌ ప్రో కో) వంటి ఆర్థికనేరాలు పెరగడానికి ఈ విధానం కారణమవుతోంది. కరోనా సమయంలోనూ కార్పొరేట్లకు కేంద్ర ప్రభుత్వం నుండి భారీ మొత్తంలో రాయితీలు అందడం ఈ సందర్భంగా గమనార్హం.
2017-18 నుండి 2019-20 వరకు 6,701 కోట్ల రూపాయల విలువైన ఎలక్టోరల్‌ బాండ్స్‌ అమ్ముడుపోగా ఆ మొత్తంలో 4,215.89 కోట్ల రూపాయలు బిజెపికే దక్కాయి. 2020-21 సంవత్సరంలో కూడా 75 శాతం ఎలక్టోరల్‌ బాండ్స్‌ మొత్తం బిజెపికే చేరాయి. ఈ ఏడాది జులైలో 389.50 కోట్ల రూపాయల విలువైన ఎలక్టోరల్‌ బాండ్ల విక్రయం జరగ్గా, అక్టోబర్‌లో 10,246 కోట్ల రూపాయల బాండ్లను కార్పొరేట్‌ సంస్థలు కొనుగోలు చేశాయి. ఈ మొత్తంలో కూడా అధికశాతం బిజెపికే దక్కినట్లు వివిధ వర్గాల సమాచారం. ఈ కారణం చేతనే ఒకవైపు ఎన్నికల కోడ్‌, మరోవైపు అత్యున్నత న్యాయస్థానపు విచారణ ఉన్నా మోడీ ప్రభుత్వం ఎన్నికల వేళ కార్పొరేట్‌ నిధుల సేకరణ కోసం బరితెగించింది. ఏకపక్షంగా సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. ఓటర్లను ప్రభావితం చేయడమే లక్ష్యంగా ఈ ఉత్తర్వులు జారీ అయి రోజులు గడుస్తున్నా ఎన్నికల కమిషన్‌ మౌనంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ విషయమై ఇ.సి స్పందించాలి. ఎలక్టోరల్‌ బాండ్స్‌ విక్రయాన్ని తక్షణం నిలిపివేయాలి. ఒకవేళ బాండ్ల విక్రయం జరిగినా వాటిని రాజకీయ పార్టీలకు చేరకుండా అడ్డుకోవాలి. ఈ పని చేయకపోతే గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ల్లో జరిగే ఎన్నికల అక్రమాలకు ఇ.సి నే బాధ్యత వహించాల్సి ఉంటుంది. రాజకీయ అవినీతికి చట్టబద్దత కల్పించిన ఎలక్టోరల్‌ బాండ్స్‌ను పూర్తిస్థాయిలో రద్దు చేయడమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం. ఆ దిశలో ప్రజాస్వామ్య వాదులు కృషి చేయాల్సి ఉంది.