
- అరకొరగా 'సంక్షేమం' శ్రీప్రతి ఓటరు పైనా రూ.1.2 కోట్ల రుణ భారం
- 10న తేలనున్న బిజెపి భవితవ్యం
బెంగళూరు : కర్ణాటకలో ఇప్పటి వరకూ అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసింది. సంక్షేమానికి మాత్రం అరకొరగా కేటాయింపులు జరిపింది. ఈ నెల 10న జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీకి ఓటమి తప్పదని పలు ఒపీనియన్ పోల్స్ అంచనా వేయడానికి బహుశా ఇది కూడా ఒక కారణం కావచ్చు. కర్ణాటకలో బిజెపి తిరిగి అధికారంలోకి రావడం కష్టమేనని మెజారిటీ సర్వేలు తేల్చేశాయి. దేశంలో ఆర్థికంగా పటిష్టంగా ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటకది నాలుగో స్థానం. ఆధునిక పరిశ్రమలకు కూడా అది కేంద్ర స్థానంగా కొనసాగుతోంది. అయినప్పటికీ గత నాలుగేళ్లలో బిజెపి ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేసింది.
ఆర్‌బిఐ క్రోడీకరించిన రాష్ట్రాల బడ్జెట్ల సమాచారం ప్రకారం ఈ సంవత్సరం మార్చి నాటికి కర్ణాటక అప్పుల భారం రూ.5.35 లక్షల కోట్లకు చేరింది. 2018లో ఈ అప్పులు కేవలం రూ.2.46 లక్షల కోట్లు మాత్రమే. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి ఓటరు తల పైనా రూ.1,02,107 రుణ భారం పడుతోంది. గత ఐదేళ్లలో తలసరి అప్పు 106 శాతం పెరగడం (2018లో ఇది రూ.49,505 మాత్రమే) ఆందోళన కలిగిస్తోంది. 2017లో కేంద్రం జిఎస్‌టి విధించిన తర్వాత రాష్ట్రాలకు కేంద్ర సాయం తగ్గిపోయింది. రుణాలు సైతం అందడం లేదు. పైగా కోవిడ్ అనంతర పరిస్థితులను ఎదుర్కోవడానికి పెడుతున్న ఖర్చులో రాష్ట్రాలే ఎక్కువగా భరించాల్సి వస్తోంది. అయినప్పటికీ సామాజిక రంగాలపై ప్రభుత్వాలు తగినంత మొత్తాన్ని ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది.

- అప్పులు చేసినా.. సంక్షేమానికి అరకొర కేటాయింపులే
కర్ణాటకలో సంక్షేమానికి అరకొరగా కేటాయింపులు జరుపుతున్నారు. 2022-23 బడ్జెట్‌లో కర్ణాటకలోని డబుల్ ఇంజన్ ప్రభుత్వం మొత్తం వ్యయంలో విద్యపై 12 శాతం మాత్రమే ఖర్చు చేస్తానని ప్రతిపాదిం చింది. దేశంలోని ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సగటున విద్యకు కేటాయించిన 13.6 శాతంతో పోలిస్తే ఇది తక్కువే. అదేవిధంగా వైద్యం, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమం పద్దుకు కేటాయించింది 5.4 శాతమే. ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ రంగానికి సగటున కేటాయించిన 5.7 శాతం నిధులతో పోల్చినా కూడా ఇది తక్కువే.
వాస్తవానికి విద్యా రంగంపై 2019-20లో కర్ణాటక ప్రభుత్వం 12.4 శాతం ఖర్చు చేయగా, 2022-23 నాటికి అది 12 శాతానికి తగ్గిపోయింది. వైద్యం, ప్రజారోగ్యంపై 2019-20లో 4.1 శాతం ఖర్చు చేయగా, కోవిడ్ అనంతరం ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా 2021-22 (సవరించిన అంచనాలు)లో 5.8 శాతం ఖర్చు చేశారు. ఆ తర్వాత ఈ రంగంపై వ్యయం తగ్గుతూ వచ్చింది. 2022-23లో 5.4 శాతం మాత్రమే ఖర్చు చేశారు.
బిజెపి ప్రభుత్వం రుణాల ద్వారా సమీకరించిన వనరులను ప్రజా సంక్షేమానికి వెచ్చించడంలో విఫలమైంది. 2020-21లో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో (జిఎస్‌డిపి) అభివృద్ధి వ్యయం 9.4 శాతం ఉండగా, 2021-22 నాటికి 8 శాతానికి, 2022-23 బడ్జెట్ అంచనాల్లో 7.6 శాతానికి తగ్గింది. 2020-21లో సామాజిక రంగంపై జిఎస్‌డిపిలో ఐదు శాతం ఖర్చు చేయగా, అది 2021-22లో 4.9 శాతానికి, 2022-23లో 4.5 శాతానికి తగ్గింది. దీనిని బట్టి అర్థమవుతోంది ఏమంటే బిజెపి పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలు అప్పుల ద్వారా వనరులు సమీకరిస్తాయి. ముఖ్యంగా వాణిజ్య లేదా మార్కెట్ నుంచి రుణాలు పొందుతాయి. విద్య, ఆరోగ్యం, సామాజిక సంక్షేమం వంటి ప్రజా సంక్షేమ చర్యల కోసం మాత్రం నిధులు విదల్చవు. బహుశా ఈ రుణాలను మూలధనపు వ్యయం కోసం ఉపయోగిస్తూ ఉండవచ్చు. అంటే మౌలిక సదుపాయాల కల్పన వంటి పద్దుల కోసం వ్యయం చేయవచ్చు. అయితే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ వ్యయం కూడా సరిగా ఉండడం లేదు. 2020-21లో జిఎస్‌డిపిలో మూలధనపు వ్యయం కోసం 2.6 శాతం కేటాయించగా 2021-22లో 1.9 శాతానికి తగ్గిపోయింది. 2022-23లో కూడా బడ్జెట్ అంచనాలు అదే విధంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ కేటాయింపు చాలా తక్కువ.

ఒక్క మాటలో చెప్పాలంటే ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పోలిస్తే కర్ణాటకలో వివిధ రంగాలకు బిజెపి ప్రభుత్వం చేస్తున్న కేటాయింపులు చాలా తక్కువగా ఉంటున్నాయి. అభివృద్ధి వ్యయం కోసం ఇతర ప్రాంతాలు 12.5 శాతం కేటాయిస్తే కర్ణాటక కేవలం 7.6 శాతం, సామాజిక రంగానికి ఇతర ప్రాంతాలు 8.4 శాతం కేటాయిస్తే కర్ణాటక 4.5 శాతం, మూలధనపు వ్యయానికి ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు 2.9 శాతం కేటాయిస్తే కర్నాటక 1.9 శాతం మాత్రమే కేటాయించింది.
కర్ణాటకలో సంక్షేమ రంగాలకు బిజెపి ప్రభుత్వం చేస్తున్న అరకొర కేటాయింపుల కారణంగా సామాన్య ప్రజానీకానికి పెద్దగా ఒరిగిందేమీ లేదు. దీంతోపాటు ప్రభుత్వంలో అవినీతి పెచ్చరిల్లిపోయిందన్న విమర్శల జడివానలో బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం తడిసి ముద్దవుతోంది. వీటన్నింటి నడుమ కర్ణాటక ప్రజలు ఇచ్చే తీర్పు కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.