May 28,2023 07:27

విజయనగర సామ్రాజ్యానికి రాజు శ్రీకృష్ణ దేవరాయలు. వారి సభ పేరు భువన విజయం. ఈ సభలో 8 మంది కవులు వుండేవారు. వీరిని అష్టదిగ్గజ కవులు అంటారు. ఒకరోజు రాజు కవులతో సభ ఏర్పాటు చేశారు. కవులను ఇలా అడిగాడు. 'మనం పెంచుకునే జంతువుల్లో అందమైన జంతువు ఏది? అని. అందుకు కవులందరూ ఏకాభిప్రాయంతో పిల్లి అని జవాబు ఇచ్చారు. అయితే ఒక వింత పిల్లి కావాలని రాజు కవులకు ఆజ్ఞాపించాడు.
మరుసటి రోజు కవులంతా తమ తమ పిల్లలను తీసుకొని వచ్చి వాటి వింత ఏమిటో చెప్పసాగారు. తెనాలి రామకృష్ణ కవి వంతు వచ్చింది. తన పిల్లిని తీసుకుని వచ్చాడు. తన పిల్లి పాలు తాగదని, అదే వింత అని చెప్పాడు. రాజు పరీక్షించ దలిచాడు. పాలతో నింపిన గిన్నెలు వరుసలో పెట్టించాడు. పిల్లులన్నీ వెళ్లి పాలగిన్నెలో మూతి పెట్టి తాగ సాగాయి. రామకృష్ణ పిల్లి మాత్రం పాల గిన్నెలు వద్దకు వెళ్లకుండా ఉండిపోయింది. బొమ్మలా నిలబడిపోయింది. ఆ వింతకు రాజు, సభలో ఉన్నవారు ఆశ్చర్యపోయారు. తెనాలి రామకృష్ణుడి పిల్లికి మెచ్చి బహుమతి ఇచ్చారు.
ఇదెలా సాధ్యం? అని రాజు రామకృష్ణుడిని అడిగాడు.. 'వారం రోజుల క్రితం పని మీద వెళ్లి మూడు రోజులు వేరే ఊరులో ఉన్నాను. దీనికి తినటానికి ఏమి పెట్టలేదు. ఊరు నుంచి వచ్చిన తరువాత వేడివేడి పాలు గిన్నెలో పోసి పెట్టాను. ఆకలితో ఉండడం వల్ల ఒక్క అంగలో వచ్చి పాల గిన్నెలో మూతి పెట్టింది. అంతే. మూతి కాలింది. అప్పట్నుంచి గిన్నెలో పాలు తాగడానికి భయపడుతోంది' అన్నాడు. అందరూ గొల్లుమని నవ్వారు.

cat 2

 

 

 

 

 

- యడ్ల యానీ అక్షర, 7వ తరగతి
పల్నాడు చిల్డ్రన్‌ క్లబ్‌, జనవిజ్ఞాన వేదిక, చిలకలూరిపేట