కారకాస్ : బ్రెజిల్, అర్జెంటీనాలు ఉమ్మడి కరెన్సీ చొరవను వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురో స్వాగతించారు. ఈ చొరవ లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాల స్వాతంత్య్రం, ఐక్యత మరియు విముక్తికి చిహ్నమని ప్రకటించారు. దక్షిణ అమెరికా కోసం ఉమ్మడి కరెన్సీని రూపొందించడానికి చర్యలు తీసుకుంటామని బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డసిల్వా, అర్జెంటీనా అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండేజ్‌లు సోమవారం ప్రకటించారు. వెనెజులా సిద్ధంగా ఉందని, లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాల కోసం కరెన్సీని సృష్టించే చొరవకు మద్దతు ఇస్తున్నామని తాను ప్రకటిస్తున్నానని అన్నారు. మంగళవారం అర్జెంటీనా రాజధాని బ్యూనోస్ ఎయిర్స్‌లో నిర్వహించే సిఇఎల్‌ఎసి 7వ సదస్సు శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతున్న దేశాధి నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే గ్రేట్ మార్చ్‌లో భాగంగా వీధుల్లో నిరసన చేపట్టిన వేలాది మంది ప్రజలను మదురో అభినందించారు. వెనెజులాపై అమెరికా విధిస్తున్న ఏకపక్ష, నిర్బంధ చర్యలను వ్యతిరేకిస్తూ సోమవారం గ్రేట్ నేషనల్ మార్చ్ చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రజలు న్యాయమైన కారణంతో ర్యాలీ చేపట్టారని అన్నారు. వెనెజులాపై విధిస్తున్న ఆర్థిక సామాజిక ఆంక్షలకు వ్యతిరేకంగా, మా మాతృభూమిపై నేరారోపణలు, హింసకు వ్యతిరేకంగా ఈ రోజు దేశ ప్రజలంతా ఐక్యతను సాధించడానికి శాశ్వతంగా ఉద్యమించాలని తాను పిలుపునిస్తున్నానని అన్నారు. ప్రతి ఏడాది జనవరి 23న సైనిక నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజల- సైనిక తిరుగుబాటు చారిత్రక మేల్కలుపుగా నిలుస్తుందని అన్నారు. అలాగే అమెరికా సామ్రాజ్యవాదం, దాని ఓటమి పాలైన తిరుగుబాటుకు వ్యతిరేకంగా వెనెజులా ప్రజలు సాధించిన విజయాన్ని కూడా గుర్తు చేస్తుందని అన్నారు.