Sep 09,2023 08:29

కారకస్‌ : వెనిజులా అధ్యక్షులు నికొలస్‌ మదురో శుక్రవారం నుండి చైనాలో అధికార పర్యటన జరుపుతున్నారు. 14వరకు ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. చైనా అధ్యక్షులు షీ జిన్‌పింగ్‌ ఆహ్వానం మేరకు మదురో శుక్రవారం బయలుదేరి షెంఝాన్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఈ పర్యటన ఉపయోగపడుతుందని మదురో వ్యాఖ్యానించారు. కొత్త ప్రపంచ భౌగోళిక రాజకీయాలను నిర్మించడానికి ఉపయోగపడుతుందని అన్నారు. కాగా మదురో అధికార పర్యటన ఎజెండా, వివరాలను చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వెల్లడించలేదు. మదురో 2018 సెప్టెంబరులో చివరిసారిగా చైనాలో పర్యటించారు. గురువారం వెనిజులా ఉపాధ్యక్షురాలు డెల్సీ రొడ్రిగజ్‌, చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యి లు ద్వైపాక్షిక అంశాలను సమీక్షించిన మరుసటిరోజు మదురో పర్యటన ప్రారంభమైంది. ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయిలో దౌత్య సంబంధాలు మరింత సంఘటితం కావాలని ఇరు పక్షాలు అభిప్రాయపడ్డాయని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది.